![]() |
![]() |

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని వింటున్నాం. కానీ అప్పట్లోనే వివిధ భాషల ప్రేక్షకులను మెప్పించేలా భారీ సినిమాలను రూపొందించారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar). ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఆరోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' ఇలా ఒకటేమిటి ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే. ఇండియన్ సినిమాకి ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాలను అందించారు. గ్రాఫిక్స్ అంటే ఏంటో పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించారు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. 2010లో వచ్చిన 'రోబో' తర్వాత ఇది శంకర్ సినిమా అంటే అని గర్వంగా చెప్పుకునేలా, అభిమానులు నూటికి నూరు శాతం సంతృప్తి చెందే సినిమా రాలేదనే చెప్పాలి. 'స్నేహితుడు', 'ఐ', '2.0' సినిమాలు కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నప్పటికీ.. అభిమానులను పూర్తిస్థాయిలో తృప్తి పరచలేదనేది వాస్తవం. ఇక తాజాగా విడుదలైన 'భారతీయుడు-2' (Indian 2) మూవీ ఫ్యాన్స్ కి మరింత నిరాశ కలిగిస్తోంది. దీంతో అప్పటి డైరెక్టర్ శంకర్ తప్పిపోయాడు, ఆయన మార్క్ మూవీ మళ్ళీ చూడాలని ఉంది అంటూ అభిప్రాయాలు అభిప్రాయపడుతున్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా శంకర్ రూపొందించిన 'భారతీయుడు' చిత్రం 1996 లో విడుదలై, ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆల్ టైం క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటి క్లాసిక్ కి సీక్వెల్ గా ఏకంగా పాతికేళ్ల తర్వాత 'భారతీయుడు 2'ని శంకర్ ప్రకటించినప్పుడు అందరూ ఎంతగానో ఎక్సైట్ అయ్యారు. కానీ సినిమా బాగా ఆలస్యమవ్వడం, ప్రచార చిత్రాలు శంకర్ సినిమా స్థాయిలో లేకపోవడంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇక విడుదల తర్వాత మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తోంది. సినిమాలో శంకర్ మార్క్ పూర్తిగా మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలిది నిజంగా శంకర్ సినిమానేనా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. తమకి మునుపటి శంకర్ కావాలని, బిగ్ స్క్రీన్ పై మళ్ళీ శంకర్ మ్యాజిక్ చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
ప్రస్తుతం శంకర్ చేతిలో 'భారతీయుడు 3' (Indian 3), 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలు ఉన్నాయి. 'భారతీయుడు 2' ప్రభావంతో 'భారతీయుడు 3'పై దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'గేమ్ ఛేంజర్' పైనే ఉంది. రామ్ చరణ్ (Ram Charan), శంకర్ కాంబినేషన్ వస్తున్న మొదటి సినిమా ఇది. అయితే 'భారతీయుడు 2' కారణంగా బాగా ఆలస్యమవ్వడంతో ఈ సినిమా పట్ల చరణ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. దానికి తోడు.. ప్రస్తుత శంకర్ ఫామ్, 'భారతీయుడు 2'కి వస్తున్న టాక్ తో వారిలో ఆందోళన మొదలైంది. మరి అందరూ కోరుకుంటున్నట్టుగా 'గేమ్ ఛేంజర్'తో కమ్ బ్యాక్ ఇచ్చి.. తన అభిమానులతో పాటు, రామ్ చరణ్ అభిమానులను కూడా దర్శకుడు శంకర్ ఆనందపరుస్తారేమో చూడాలి.
![]() |
![]() |