![]() |
![]() |

సినిమాలలో లౌక్యం ఉండాల్సిందే. అంతేగాని పట్టుదల పనికిరాదు. మరీ మొండిగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించి నిర్ణయాలు తీసుకోవాలి. పట్టువిడుపులు చాలా ముఖ్యం. కానీ మొండివాడు రాజుకంటే బలవంతుడు అనే సామెత ఇక్కడ పనికి రాదు. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి అలాగే ఉంది. ఆయన పరిస్థితి చూస్తుంటే కక్కలేక మింగాలేక అన్నట్లుగా.. కరిస్తే కప్పకు కోపం, వదిలిపెడితే పాముకు కోపం అన్నట్టుగా తయారయింది. ఈమధ్య ఆయన వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ గురించిన అనవసరంగా ప్రస్తావిస్తూ.. విజయ్ నెంబర్ వన్ అని కామెంట్ చేసి కోలీవుడ్‌లో అజిత్ ఫ్యాన్స్ చేత నానా మాటలు అనిపించుకుంటున్నారు.
ఇక తెలుగులో ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' విడుదల కాబోతున్న సమయంలో తాను తమిళంలో కోలీవుడ్ స్టార్ విజయ్‌తో తీస్తున్న 'వారిసు' చిత్రాన్ని అదే పనిగా ఇదే పోటీలో 'వారసుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి దిల్ రాజే పండుగ సందర్భంలో తెలుగు సినిమాలకు కేటాయించిన తర్వాతే థియేటర్లను డబ్బింగ్ చిత్రాలకు కేటాయించాలని అన్నారు. ఇప్పుడు ఆ మాటను ఆయనే హద్దు మీరుతున్నారు. పోయి పోయి చిరు- బాలయ్యలతో పెట్టుకుంటున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా రాబోయే కాలంలో మొండిగా ప్రవర్తిస్తే దిల్ రాజుకు మాత్రం తిప్పలు ఖాయమంటున్నారు. నిర్మాతగా ఆయన ఎంతో సక్సెస్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఇక చిన్న సినిమాలకు దిల్ రాజు థియేటర్లు ఇవ్వకుండా తొక్కేస్తున్నారు అన్నది ఒక పెద్ద వివాదమే అయింది.
'కార్తికేయ 2' సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కి దిల్ రాజే ప్రధాన కారణం అని ప్రచారంలోకి వచ్చింది. దాంకి తగ్గట్లు ఆ టైంలో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన సినిమాని అనుకున్న టైంలో రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారని అనడం దిల్ రాజును ఉద్దేశించేనని మీడియాలో ప్రచారం జరిగింది. అదే సమయంలో తన సొంత బ్యానర్ నుంచి 'థాంక్యూ' చిత్రం విడుదల కానుండటంతో పాటు మూడు సినిమాల నిర్మాతలతో మాట్లాడి 'కార్తికేయ 2' సినిమాని వాయిదా వేసుకోమని అన్నారట. అది రిక్వెస్ట్ మాత్రమే గానీ బలవంతం చేయలేదని అంటున్నారు దిల్ రాజు. తన మీద కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఆమధ్య మహేష్ సినిమా వసూళ్ల విషయంలో కూడా తాను ఏదో కామెంట్ చేశానని మహేష్ తన నెక్స్ట్ సినిమా దిల్ రాజుకి ఇవ్వవద్దని ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. వాటిపై కూడా దిల్ రాజు స్పందించారు. మహేష్ చాలా సెన్సిటివ్. ఆ టైంలో తనకి ఏది అనిపిస్తే అదే చేస్తాడు. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. తన సినిమా కలెక్షన్ విషయంలో నేనేదో అన్నానని మహేష్ కి ఎవరో చెప్పడం, దానిమీద అతను సీరియస్ కావడం జరిగాయని దిల్ రాజు చూచాయగా ఒప్పుకున్నారు. అయినా మహేష్ తనకు నిర్మాతగా అవకాశం ఇస్తాడని నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి "నేనేంటో దర్శకులకు హీరోలకు తెలుసు కాబట్టి ఎవరెవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు" అంటూ కాస్త కవరింగ్ ఇచ్చారు.
సినిమా పరిశ్రమలో ఈగోలు తారాస్థాయిలో ఉంటాయి. దీనికి ఉదాహరణ చిరంజీవి మోహన్ బాబుల మధ్య వచ్చిన మనస్పర్ధలు. చిరంజీవి నటించిన 'చక్రవర్తి' సినిమా విడుదలైన తర్వాత మోహన్ బాబు ఎవరితోనో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది అన్నాడని... ఆ విషయం చిరుకి తెలియడంతో అప్పటినుంచి వారి మధ్య అలాగే మనస్పర్ధలు కొనసాగుతున్నాయని తెలిసిన వారు చెబుతుంటారు. వారు పైకి "మేము మేము ఒకటే" అన్నట్టు ఉన్నా ఆ విషయంలో మాత్రం వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇప్పటికీ కొనసాగుతున్న విషయం మాత్రం వాస్తవం. ఇక దిల్ రాజు 'వారసుడు' సినిమా కోసం తన గుప్పెట్లో ఉన్న నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలోని థియేటర్లను బ్లాక్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. దాంతో చిరు, బాలయ్య చిత్రాలకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది. ఈ రెండు చిత్రాలతో సరి సమానంగా వారసుడు చిత్రానికి కూడా థియేటర్లు కేటాయించేలా దిల్ రాజు పావులు కదుపుతున్నారు. ఇది ఎవరికీ నచ్చడం లేదు. తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ "సినిమాలలో కంటెంట్ ఉంటే ఎవరు ఎవర్ని ఆపలేరు. ఒక సినిమా హిట్టయ్యేది, లేనిది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరి వ్యాపారం వారిది." అని మాట్లాడారు.
అంతే కాదు.. "మూడు సినిమాలకు మంచి థియేటర్లు వస్తాయి. మొదటి వీకెండ్ అయిన తర్వాత ఏ చిత్రానికి హిట్ టాక్ వస్తుందో మిగిలిన థియేటర్లను కూడా ఆ తర్వాత వాటికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నా అవి చెల్లవు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. మరీ ఇలా మొండిగా ప్రవర్తిస్తే రాబోయే కాలంలో ఆయనకు తెలుగు స్టార్ హీరో ఎవరు అవకాశాలు ఇవ్వరని అంటున్నారు.
మరోవైపు ఆయన ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ, "నాకు మహేష్ బాబు, మురుగదాసుల కాంబినేషన్లో వచ్చిన 'స్పైడర్' చిత్రం భారీ నష్టాలను కలుగజేసింది. ఆ వెంటనే 'అజ్ఞాతవాసి'ని కూడా తీసుకున్నాను. అది కూడా పెద్ద దెబ్బేసింది. కానీ అదే సమయంలో నేను తీసిన కొన్ని చిన్న చిన్న చిత్రాలు హిట్టవడంతో ఆ నష్టాల శాతాన్ని తగ్గించుకోగలిగాను. అదే మరో నిర్మాత అయితే సూసైడ్ చేసుకోవడమో లేక ఇండస్ట్రీ వదిలి పారిపోవడం చేసేవాడు" అని వ్యాఖ్యలు చేయడంపై మహేష్, పవన్ అభిమానులు కూడా దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. ఇలాగే తనదైన యాటిట్యూడ్‌ను, తనకు తిరుగులేదనే మనస్తత్వాన్ని దిల్ రాజు వదులుకోకుంటే.. భవిష్యత్తులో ఆయనకు కోలీవుడ్ హీరోలే గతి అని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
![]() |
![]() |