![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకేనేమో విడుదలకు ఏడాది ముందే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి.
'ప్రాజెక్ట్ కె' నైజాం రైట్స్ ని ఏషియన్ సునీల్ ఏకంగా రూ.70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి-2' చిత్రం నైజాంలో సుమారు రూ.68 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటిది 'ప్రాజెక్ట్ కె' రైట్స్ రూ.70 కోట్లకు అమ్ముడవ్వడం చూస్తుంటే.. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఇంతవరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. పైగా ప్రభాస్ గత చిత్రాలు 'సాహో', 'రాధేశ్యామ్' నిరాశపరిచాయి. అయినప్పటికీ ఈ స్థాయిలో బిజినెస్ జరగడం సంచలనంగా మారింది.
ఇప్పటిదాకా నైజాంలో వంద కోట్ల షేర్ మార్క్ అందుకున్న ఏకైక సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. ఇప్పుడు 'ప్రాజెక్ట్ కె' బిజినెస్ 70 కోట్లు జరగడం చూస్తుంటే.. ఇది కూడా వంద కోట్ల షేర్ రాబట్టిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |