Home  »  News  »  Ustaad Bhagat Singh: 'కాలరే ఎత్తరా' సాంగ్.. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ దద్దరిల్లిపోయింది

Updated : Mar 12, 2026

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా చిత్రబృందం థర్డ్ సింగిల్ గా 'కాలరే ఎత్తరా'(Collar Ey Etthara)ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ కార్యక్రమం జరిగింది.

'కాలరే ఎత్తరా' పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో సెట్‌లు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన మార్క్ స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో మ్యాజిక్ చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బీట్స్, రామ్ మిర్యాల గానం, కాసర్ల శ్యామ్ లిరిక్స్ కలిసి.. 'కాలరే ఎత్తరా'ను ఒక మంచి మాస్ పాటగా మలిచాయి.

'కాలరే ఎత్తరా' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించిన రాశి ఖన్నాకు ముందుగా కృతఙ్ఞతలు. ఈ పాటలో కూడా కళ్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు రాశి. 1500-2000 మందితో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ గారు వేసిన డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాని ప్రాణం పెట్టి పని చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే.. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కెరీర్ లోనే భారీ సెట్ ను ఈ పాట కోసం వేశారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం." అన్నారు

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చింది. 'గబ్బర్ సింగ్' స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారితో గుర్తుండిపోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హరీష్ శంకర్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టం న భూతో న భవిష్యతి. ప్రజా సేవలో తీరిక లేకుండా ఉండి కూడా.. ఈ సినిమా పట్ల ఆయన చూపిన డెడికేషన్ కి హ్యాట్సాఫ్. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అభిమానులకు మేము ఒక హామీ ఇవ్వగలను. ఖుషి నాటి రోజులను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం ఎంజాయ్ చేసేలా అన్ని అంశాలతో ఈ సినిమాను హరీష్ శంకర్ గొప్పగా తెరకెక్కించారు." అన్నారు.

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. "మీ అందరి ఉత్సాహం చూస్తుంటే పాట ఎంతగానో నచ్చిందని అర్థమవుతోంది. నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు ఒకే ఒక్క కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు." అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. "భీమ్లా నాయక్ లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి డ్యాన్స్ నెంబర్ రాయలేదనే వెలితి ఉండేది. 'కాలరే ఎత్తరా'తో ఆ వెలితి తీరిపోయింది. ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరింత ఉత్సాహంగా జరుపుకుందాం." అన్నారు.

కాగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం మార్చి 19న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్. మార్చి 14న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల కానుంది. మార్చి 15న ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.