![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల బాధ్యతలు చేపట్టారు. దీంతో సినిమాల విషయంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఇక పూర్తిగా రాజకీయాలకు పరిమితం కావాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా షూటింగ్ చివరి దశలో ఉన్న 'హరి హర వీరమల్లు', 'ఓజీ' చిత్రాలను ముందు పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. 'ఉస్తాద్ భగత్ సింగ్' ని మాత్రం కొద్ది నెలల తర్వాత పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యమవుతుండంతోనే ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.. రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సినిమా కూడా పూర్తి కావొస్తుంది. కానీ 'ఉస్తాద్' రీ స్టార్ట్ కావడానికి మాత్రం మరింత టైం పట్టేలా ఉంది. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమాని కంప్లీట్ చేయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడట.
చిరంజీవి (Chiranjeevi), హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశముందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు 'ఉస్తాద్' ఆలస్యం కారణంగా ఎట్టకేలకు ఈ కాంబో సెట్ అయిందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. అంతేకాదు, ఇది హరీష్ శంకర్ మార్క్ లో ఉండే యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు.
ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రం చేస్తున్నారు చిరంజీవి. ఆగస్టు నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చు అంటున్నారు. మరోవైపు హరీష్ శంకర్ కూడా 'మిస్టర్ బచ్చన్' షూట్ ని త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే అవకాశముంది.
![]() |
![]() |