![]() |
![]() |

సోషల్ మీడియా, అందునా ట్విట్టర్ అంటే మొదట గుర్తొచ్చేది ఫ్యాన్ వార్సే. అయితే ట్విట్టర్ ని సరిగ్గా వాడితే.. మనం ఇతరుల సాయం పొందడానికో లేక సాటి మనిషికి మనం సాయం చేయడానికో కూడా ఉపయోగపడుతుంది. తాజాగా ఓ ఎన్టీఆర్ అభిమాని తాను కష్టాల్లో ఉన్నానని ట్వీట్ చేయగా.. అతన్ని ఆదుకోవడానికి బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ముందుకొచ్చారు.
"ప్రస్తుతం నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్య సమస్యల వల్ల మొత్తం డబ్బు ఖర్చయిపోయింది. ఆర్థికంగా పూర్తిగా వెనకబడ్డాను. ఒక దశలో సూసైడ్ దాకా కూడా వెళ్లాను. కానీ నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం మళ్లీ బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ఈ తీవ్ర పరిస్థితిలో చివరికి ఒక్క ఆశతో నా బాధను ట్విట్టర్ లో నా స్నేహితులు, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర ఫ్యాన్స్ తో పంచుకున్నా. కొంతమంది స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఇంకా సుమారు 2 లక్షల వరకు అవసరం ఉంది. దయచేసి, మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఈ క్లిష్ట సమయంలో నాకు మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను." అంటూ సోమేశ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.

సోమేశ్ ట్వీట్ కి బెల్లంకొండ స్పదించాడు. మూవీ ప్రమోషన్స్ కోసం విజయవాడ వస్తున్నానని, నేరుగా కలిసి సాయం చేస్తానని చెప్పాడు. మరోవైపు మంచు మనోజ్ కూడా "నీ నంబర్ పంపు తమ్ముడు. ధైర్యంగా ఉండు. మేమంతా నీతో ఉన్నాం." అంటూ అతనికి ధైర్యం చెప్పాడు.

సోమేశ్ ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా తమకు తోచిన సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కష్టాల్లో ఉన్నానంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ కి స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
![]() |
![]() |