Home  »  News  »  చైనా ఫోన్లపై 'మేడ్ ఇన్ ఇండియా' ట్యాగ్.. రియల్ స్కామ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే.?

Updated : Jul 31, 2026

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' లో జులై 29వ తేదీ నుంచి 'ఆజాదీ 501' (Azadi 501) అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. సాయితేజ కల్వకోట కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్‌కు శివతేజ దర్శకత్వం వహించారు. మొత్తం 6 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్, ఒకప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఒక భారీ స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ కథ అంతా 2014 నుండి 2018 మధ్యకాలంలో కాకినాడ నేపథ్యంతో నడుస్తుంది. కథానాయకుడు జితేంద్ర (సాయితేజ కల్వకోట) తన తల్లి యశోద, చెల్లెలు ప్రీతితో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ జితేంద్ర భుజాలపై పడతాయి. తండ్రి నిర్మించిన స్కూల్ హక్కుల కోసం కోర్టులో సుదీర్ఘమైన కేసు నడుస్తూ ఉంటుంది. ఒకవైపు తండ్రి ఆశయమైన స్కూల్‌ను కాపాడుకోవడం, మరోవైపు కుటుంబ అవసరాలను తీర్చడం జితేంద్రకు పెద్ద సవాలుగా మారుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక అతనిలో మొదలవుతుంది. ఈ ఆలోచనతోనే తన స్నేహితుడు కిషన్ సహాయంతో ఒక సంచలనాత్మక వ్యాపార ప్లాన్ సిద్ధం చేస్తాడు.

అది స్మార్ట్‌ఫోన్‌లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్న కాలం. అయితే, అధిక ధరల కారణంగా సామాన్యులకు స్మార్ట్‌ఫోన్ ఒక కలగానే మిగిలిపోయింది. ఈ పాయింట్‌నే జితేంద్ర బిజినెస్ అవకాశంగా మలుచుకుంటాడు. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ అందించాలనే ఆలోచనతో, చైనా నుంచి చౌకగా ఫోన్లను దిగుమతి చేసుకుని, వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' లోగోతో 'ఆజాదీ 501' బ్రాండ్ పేరును ముద్రిస్తాడు. కేంద్ర మంత్రి శరత్ గోయెల్ (హర్షవర్ధన్) చేతుల మీదుగా ఈ 'ఆజాదీ 501' మొబైల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయిస్తాడు. ఊహించని రీతిలో ఈ ఫోన్ సంచలనం సృష్టిస్తుంది. లక్షలాది మంది ప్రజలు ఈ ఫోన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో జితేంద్ర రాత్రికి రాత్రే వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారతాడు.

అయితే, ఈ విపరీతమైన ప్రజాదరణతో పాటు జితేంద్రకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సెంట్రల్ మినిష్టర్ శరత్ గోయెల్ కన్ను జితేంద్ర సంపాదన, లాభాలపై పడుతుంది. మరోవైపు, ఈ రూ. 501 స్మార్ట్‌ఫోన్ వెనుక ఏదో పెద్ద మోసం దాగి ఉందనే అనుమానంతో ఐపీఎస్ ట్రైనీ చాణక్య చక్రవర్తి (శశాంక్) విచారణ ప్రారంభరిస్తాడు. దీనికి తోడు నిజానిజాలు బయటకు తీయడానికి స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ (రవివర్మ) కూడా రంగంలోకి దిగుతాడు. మూడంచెల ఒత్తిడి నడుమ, రాజకీయనాయకులు మరియు అధికారుల నుంచి ఎదురయ్యే బెదిరింపులకు జితేంద్ర భయపడకుండా, లంచాలు ఇవ్వకుండా తన ప్లాన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది ఈ సిరీస్‌లో ప్రధానాంశం.

దర్శకుడు శివతేజ వ్యాపారం మరియు మోసం అనే రెండు కోణాలను చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. 2014-2018 కాలంలో జరిగిన నిజమైన స్కామ్ ఘటనలను ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్‌గా తెరకెక్కించారు. సాయితేజ నటన, శశాంక్, హర్షవర్ధన్, రవివర్మ పాత్రలు సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. చివర్లో వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. లవ్ ట్రాక్ లేకపోవడం, మదర్ సెంటిమెంట్ మోతాదు కొద్దిగా తగ్గడం చిన్నపాటి లోపాలుగా అనిపించినా, మొత్తం మీద 2.75/5 రేటింగ్‌తో ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.