![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటి విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో, చిత్ర యూనిట్ గ్రాండ్‌గా 'పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్'ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) చేసిన ప్రసంగం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడిన మాటలు, ఇతర హీరోల సినిమాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ నెట్టింట ఒక పెద్ద చర్చకు దారితీసింది.
అనంత శ్రీరామ్ వేదికపైకి రాగానే అభిమానుల ఉత్సాహాన్ని చూసి ఎంతో ఆవేశంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నాలుగు వారాలుగా థియేటర్లలో ప్రేక్షకులు నిరంతరం చప్పట్లు కొడుతూనే ఉన్నారని, అందుకే ఈ రోజు అభిమానులు చప్పట్లు కొట్టడం కాదు, చిత్ర బృందమే ప్రేక్షకులకు కృతజ్ఞతగా చప్పట్లు కొడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సినిమా సాధించిన భారీ వసూళ్ల డేటాను ఆయన ప్రస్తావించారు. 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించిందని వెల్లడించారు. ఇవి కేవలం వసూళ్లు కావని, వసూళ్ల వరద అని ఆయన అభివర్ణించారు.
అయితే, ఈ వరదపై బురద జల్లాలని చూసిన దురదగాళ్ల సరదాను మెగా అభిమానులు తీర్చేశారని అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. సినిమాపై జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని ఇంతటి విజయాన్ని అందించినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆయన చేసిన పోలికలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. వందల మందిని ఊచకోతలు కోస్తేనో, లేదా భారీ వాహనాలను గాలిలోకి లేపేస్తేనో చప్పట్లు కొట్టడం కాదని, ఒక అద్భుతమైన కథను చూసి, కన్నీళ్లు పెట్టుకుని కుర్చీల్లోంచి లేచి చప్పట్లు కొట్టేలా 'పెద్ది' సినిమా మెప్పించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వచ్చిన ఇతర భారీ యాక్షన్ సినిమాలను, స్టార్ హీరోలను కించపరిచేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ చిత్రంలో తాను రాసిన మూడు పాటలను ఇంతగా ఆదరించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనను, ఆయన అంకితభావాన్ని ఆకాశానికెత్తారు. ఒక కమర్షియల్ హీరో అంటే కేవలం రివెంజ్ ఫార్ములా మాత్రమే కాకుండా, దేశానికే స్ఫూర్తినిచ్చే కథను ఒప్పుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని రామ్ చరణ్‌ను కొనియాడారు. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం, రామ్ చరణ్‌కు ఆస్కార్ వేదికపై గౌరవం దక్కడం ఒకెత్తయితే, చిరంజీవి గారికి అన్నిటికంటే గొప్ప పురస్కారం రామ్ చరణ్ మాత్రమేనని అనంత శ్రీరామ్ అన్నారు. ఈ స్పీచ్ మెగా ఫ్యాన్స్‌ను మెప్పించినప్పటికీ, ఇతర హీరోల అభిమానుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
![]() |
![]() |