![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది మ్యాజికల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వాటిలో `ఘరానా మొగుడు` ఒకటి. తెలుగునాట రూ. 10 కోట్ల షేర్ చూసిన తొలి చిత్రంగా వార్తల్లో నిలిచిన `ఘరానా మొగుడు`.. చిరుని నేషనల్ వైడ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ గానూ అప్పట్లో వార్తల్లోకెక్కేలా చేసింది. కన్నడ చిత్రం `అనురాగ అరళితు` (1986) ఆధారంగా రూపొందిన `ఘరానా మొగుడు`లో చిరుకి జోడీగా నగ్మా, వాణీ విశ్వనాథ్ నటించగా రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, శరత్ సక్సేనా, రమా ప్రభ, శుభ, ఆహుతి ప్రసాద్, చలపతి రావు, పి.ఎల్. నారాయణ, పొన్నాంబళం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. డిస్కో శాంతి ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. పొగరుబోతు భార్యని దారిలోకి తెచ్చుకునే ఓ భర్త కథే.. `ఘరానా మొగుడు` చిత్రం.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``బంగారు కోడిపెట్ట``, ``ఏందిబే ఎట్టాగా``, ``కిటుకులు తెలిసిన``, ``పండు పండు``, ``కప్పుకో దుప్పటి``, ``ఏ పిల్లా``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వీటిలో ``కప్పుకో దుప్పటి``కి కీరవాణి సాహిత్యమందించగా.. మిగిలిన పాటలన్నింటినీ భువనచంద్ర రచించారు. దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. దేవీవర ప్రసాద్ నిర్మించిన `ఘరానా మొగుడు`.. 1992 ఏప్రిల్ 9న విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగునాట 56 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా.. మలయాళంలో `హే హీరో` పేరుతో అనువాదమై త్రివేండ్రమ్ లోని ఓ థియేటర్ లో 175 రోజులు ప్రదర్శితమవ్వడం విశేషం. కాగా, ఈ శనివారం(ఏప్రిల్ 9)తో `ఘరానా మొగుడు` 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |