![]() |
![]() |

హాస్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కాంబినేషన్ లో రాజేంద్ర ప్రసాద్ చేసిన `వాలు జడ - తోలు బెల్టు` కూడా ఈ తరహా సినిమానే. 1990 నాటి మలయాళ చిత్రం `నన్మ నిరంజవన్ శ్రీనివాసన్` (జయరామ్, ఊర్వశి హీరోహీరోయిన్లు)కి రీమేక్ గా తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాలో రాజేంద్ర ప్రసాద్ కి జోడీగా కనక నటించగా.. వల్లభనేని జనార్ధన్, ఎమ్మెస్ గోపీనాథ్, పి.ఎల్. నారాయణ, సాయికుమార్, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బాబూ మోహన్, కోట శంకర్ రావు, అనంత్, చిట్టిబాబు, ఐరెన్ లెగ్ శాస్త్రి, వరలక్ష్మి, రాధా కుమారి, శైలజ, కల్పనా రాయ్, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
ప్రసన్న స్వరాజ్ బాణీలు అందించిన ఈ చిత్రానికి భువనచంద్ర సాహిత్యమందించగా.. ఎస్పీ బాలసుబ్రహణ్యం, చిత్ర, `మాల్గాడి` శుభ గానం చేశారు. ఇందులోని ``పెద్ద వీధి చిన్న వీధి``, ``గోలీసోడా తాగిస్తా``, ``గంగరావి చెట్టు కాడ``, ``అబ్బ ఏం గాలి`` అంటూ సాగే పాటలు రంజింపజేశాయి. ఎం. ఆర్. సి. మూవీ క్రియేషన్స్ పతాకంపై గుత్తా మధుసూదనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1992 ఫిబ్రవరి 21న విడుదలైన `వాలు జడ - తోలు బెల్టు`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |