![]() |
![]() |
.webp)
వృత్తిపరమైన విషయంలోనూ ఫ్రెండ్‌షిప్‌కు సల్మాన్ ఖాన్ ఎంతో విలువనిస్తుంటాడని ఎంతో కాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. తన సహ నటుల కోసం, స్నేహితుల కోసం పలు సినిమాల్లో ఆయన అతిథి పాత్రల్లో దర్శనమిచ్చాడు. అదే తరహాలో తనకు ఎంతో సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గాడ్‌ఫాదర్'లో ఓ స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించాడు సల్మాన్. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సన్నివేశాల్ని ముంబైలోని ఎన్‌డీ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు మోహన్‌రాజా.
లేటెస్ట్‌గా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం 'గాడ్‌ఫాదర్'లో నటించడానికి సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. సల్మాన్ నటిస్తే హిందీ బెల్ట్‌లో 'గాడ్‌ఫాదర్'కు కూడా క్రేజ్ వస్తుందని భావించిన నిర్మాతలు ఆయనకు మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ చిరంజీవి మీద ఉన్న అభిమానం, గౌరవంతో తాను ఈ సినిమా చేస్తున్నాననీ, తనకు డబ్బు అవసరం లేదనీ ఈ సినిమా ఒప్పుకున్న రోజే స్పష్టం చేశాడంట సల్మాన్. "ఈ సినిమాని చేస్తాను, మీరు నాకు డబ్బు ఇవ్వకుండా ఉంటేనే" అనే కండిషన్‌తోనే ఆయన ఈ సినిమా చేస్తున్నాడంట.
అందుకు అనుగుణంగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 'గాడ్‌ఫాదర్'లో నటిస్తున్నాడు సల్మాన్. ఈ సినిమాలో తన ఇంట్రడక్షన్ ఉండే యాక్షన్ బ్లాక్, చిరంజీవి కాంబినేషన్‌తో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, తామిద్దరూ కనిపించే ఓ స్పెషల్ సాంగ్‌ను సల్మాన్ చేస్తున్నాడు. తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్‌తో సల్మాన్‌కు ఉన్న బంధం సినిమాలకు మించింది. 'గాడ్‌ఫాదర్'లో ఆయనది స్పెషల్ రోల్ అయినప్పటికీ, కీలక సందర్భాల్లో ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. మలయాళ ఒరిజినల్ 'లూసిఫర్'లో ఆ క్యారెక్టర్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు.
![]() |
![]() |