![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. 'పుష్ప' సిరీస్ తెచ్చిన కనీవినీ ఎరుగని విజయం తర్వాత, బన్నీ ఎంచుకునే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నారనే వార్త సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది.
కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా లోకేష్కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఉండే ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లే, డార్క్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే అల్లు అర్జున్ కింగ్ సైజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఈ సంచలన కలయికకు సంబంధించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూడో సినిమా ఇది అవుతుంది.
గతంలో 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో బన్నీ, పూజాల మధ్య పండిన కెమిస్ట్రీ, 'బుట్టబొమ్మ' పాటలో వారి డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ కాంబినేషన్ తెచ్చిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే హిట్ పెయిర్ తెరపైకి రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరోవైపు లోకేష్ కనగరాజ్ గత చిత్రం 'కూలీ'లో మోనికా సాంగ్ తో పూజ మెస్మరైజ్ చేయడం విశేషం. పైగా, లోకేష్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలుగా తీర్చిదిద్దడం ఆయన శైలి. అలాంటి విలక్షణమైన టేకింగ్‌లో పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే మూవీ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
AA23, Allu Arjun, Lokesh Kanagaraj, Pooja Hegde
![]() |
![]() |