![]() |
![]() |
సాధారణంగా చిత్ర పరిశ్రమలోని నటీనటులు తమ కెరీర్ ఉజ్వలంగా సాగుతున్న సమయంలో వాళ్లు సంపాదించిన దాన్ని ఎక్కువ శాతం ఆస్తులు కొనడంలోనే ఉపయోగిస్తారు. అలా చిత్ర పరిశ్రమలో కుబేరులుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి భిన్నంగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో తన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ వస్తున్నారు. జనవరిలో మొదలుపెట్టి ఇప్పటివరకు 8 ఆస్తుల్ని కొన్న దానికంటే కొన్ని రెట్లు లాభాలకు అమ్మేశారు. అలా ఇప్పటివరకు 100 కోట్లు పొందారు. అతనెవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్.
ముంబైలో ఉన్న తన ఆస్తుల్ని వరసగా అమ్మడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ముంబాయిలోని బోరివాలి, వర్లి, లోయర్ పరేల్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను అమ్మేశారు. దీనిపై బాలీవుడ్‌లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ముంబై నుంచి అక్షయ్ మకాం మారుస్తున్నాడనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఇండియాలో కాకుండా విదేశాల్లో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది మరో వార్త. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై అక్షయ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
1987లో ‘ఆజ్’ చిత్రంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్‌గా చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు అక్షయ్‌కుమార్. ఆ తర్వాత నాలుగేళ్ళపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 1991లో ‘సౌగంధ్’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించే అవకాశం వచ్చింది. మరో రెండు సినిమాల్లో నటించిన తర్వాత ‘ఖిలాడి’ చిత్రం అక్షయ్‌కి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా, మంచి డాన్సర్‌గా, ఫైటర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. అక్షయ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా సంవత్సరాలు అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న వార్త వైరల్ అయిపోవడంతో దీనిపై అతను ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |