English | Telugu

విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా 'లాభం'. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్ ఎర్నేని పాల్గొన్నారు. 

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం బాబీ మాట్లాడుతూ.. "విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన నటించిన చిత్రాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాలు సైరా, ఉప్పెన లలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. లాభం సినిమాతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం వుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆయన లుక్ చాలా యూనిక్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

యస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ ను శ్రీగాయత్రి దేవీ ఫిలమ్స్ బ్యానర్ పై బత్తుల సత్యనారాయణ విడుదల చేస్తున్నారు.