Updated : Nov 4, 2022
మలయాళ గ్రేట్ యాక్టర్ మమ్ముట్టి, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి నటించనున్నారు. వీరిద్దరూ కలిసి ఓ తమిళ చిత్రంలో కలిసి వెండితెరపైకి రానున్నారు. 'కాకా ముట్టై' ఫేమ్ ఎం. మణికందన్ దర్శకత్వంలో వీరిద్దరూ కొత్త సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఇష్టపడే విజయ్ సేతుపతి తొలిసారి మలయాళ సూపర్ స్టార్ తో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ఇప్పటికే రజనీకాంత్‌తో 'పేట్ట', కమల్ హాసన్‌తో 'విక్రమ్' సినిమాలు చేశాడు. విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటించాడు.
ఇక 'సైరా.. నరసింహారెడ్డి' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న హిందీ చిత్రం 'జవాన్'లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇంతకు ముందు అతను మలయాళంలో నటించినా, మమ్ముట్టితో కలిసి నటించడం ఇదే తొలిసారి. 'కాకా ముట్టై'తో జాతీయ అవార్డును అందుకున్న ఎం. మణికందన్‌తో కలిసి పనిచేయడం విజయ్ సేతుపతికి ఇది మూడో సారి.
తన నటనా శైలి, నైపుణ్యం కారణంగా భారతీయ చలనచిత్ర ప్రపంచంలో చాలామంది దృష్టిని విజయ్ సేతుపతి ఆకర్షించాడు. అందుకే బహుభాషా చిత్రాల నటుడిగా మారాడు. ప్రస్తుతం అతను వివిధ భాషల్లో పలు చిత్రాలను చేస్తున్నాడు. హిందీ చిత్రం 'జవాన్'లో షారుక్ ఖాన్‌కు విలన్‌గా నటిస్తున్న అతను హీరోగా మరో హిందీ చిత్రం రూపొందుతోంది. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన హిందీ చిత్రం 'మేరీ క్రిస్మస్' విడుదలకు సిద్ధమవుతోంది. విలన్‌గా నటించిన 'మైఖేల్' అనే తెలుగు సినిమా కూడా చివరి దశలో ఉంది. ఈ మూవీలో సందీప్ కిషన్ హీరో.