English | Telugu

బాహుబలి తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ..? అంటూ వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు దర్శకధీరుడు రాజమౌళి. కొణిదెల-నందమూరి కుటుంబాలను ఏకం చేసే మెగా ప్రాజెక్ట్‌కు తెరలేపాడు జక్కన్న. రామ్‌చరణ్- ఎన్టీఆర్‌లు హీరోలుగా.. టాలీవుడ్ గతంలో ఏనాడు చూడని మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నాడు. అగ్రనిర్మాత డీవీవీ దానయ్య రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అఫిషీయల్‌గా అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ.. వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ ఫైనల్‌కు వచ్చేయడంతో త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనున్నాడట జక్కన్న.

సరే ఇంతటి ప్రెస్టేజీఎస్ ప్రాజెక్ట్‌కు టైటిల్ కూడా అదే రేంజ్‌లో ఉండాలి కదా..? మరీ టైటిల్ ఏమైనా అనుకున్నారా అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు యమధీర, బాక్సర్ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన యమదొంగ సినిమాలోని "యమ", చరణ్‌తో తీసిన మగధీరలోని "ధీర" కలిపి "యమధీర"గా.. బాక్సింగ్ నేపథ్యంలో స్టోరీ లైన్ ఉండటంతో "బాక్సర్" అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిలింనగర్‌ టాక్. మరి టాలీవుడ్‌ను శాసించే ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తిపరిచేలా.. జక్కన్న ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడో వేచి చూడాలి.