Updated : Jul 31, 2022
రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్' మూవీ జూలై 14న థియేటర్లలో విడుదలై, ఆశించిన రీతిలో ఆడలేదు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని తమిళ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ)గా రూపొందించాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా మారిన డాక్టర్‌గా రామ్ నటించాడు. విలన్‌గా ఆది పినిశెట్టి ప్రదర్శించిన అభినయం హైలైట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను మూటగట్టుకోవడమే కాకుండా, బయ్యర్లకు నష్టాలు చేకూర్చింది.
ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. ఆ డేట్ వచ్చేసింది. ఆగస్ట్ 11న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 'ది వారియర్' మూవీ స్ట్రీమింగ్ కానున్నది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించింది. మూవీకి సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను షేర్ చేసిన ఆ సంస్థ "He is ready! #TheWarriorr arrives on @DisneyPlusHSTel this August 11." అని అని ట్వీట్ చేసింది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షం కాబోతోంది.
హౌస్ సర్జన్ పూర్తిచేసుకొని, కర్నూలులోని హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేసేందుకు వచ్చిన సత్యా (రామ్ పోతినేని), కర్నూలు సిటీ మొత్తాన్ని తన కనుసన్నలతో శాసిస్తోన్న గురు (ఆది పినిశెట్టి)తో తలపడి, చావుదెబ్బలు తిని, రెండేళ్ల తర్వాత అదే ప్రాంతానికి డీఎస్పీగా వచ్చి గురును ఎలా మట్టికరిపించాడనేది 'ది వారియర్'లోని ప్రధానాంశం. సత్యా ప్రియురాలు మహాలక్ష్మిగా కృతి శెట్టి, సత్యా తల్లిగా నదియా, నటించిన ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాయగా, దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. 'బుల్లెట్' సాంగ్, 'విజిల్' సాంగ్ మాస్‌లో బాగా పాపులర్ అయ్యాయి.