English | Telugu

ర‌వితేజ స్పీడ్ మామూలుగా ఉండ‌దు. ఆయ‌న సినిమాల్లో క్యారెక్ట‌ర్ ప‌రుగెడుతూ ఉంటుంది. ర‌వితేజ కెరీర్‌కూడా అలానే సాగింది. యేడాదికి మూడు సినిమాలు గ్యారెంటీ. సినిమా అవ్వ‌గానే మ‌రో సినిమాని ఎక్స్ ప్రెస్ స్పీడుతో ప‌ట్టాలెక్కించేసేవాడు. మూడు నెల‌ల‌కో సినిమాతో ర‌వితేజ కావ‌ల్సినంత సంద‌డి చేసేవాడు. అయితే.. ర‌వితేజ దూకుడు ఈమ‌ధ్య అమాంతం త‌గ్గింది. యేడాదికి ఒక్క సినిమాతో స‌ర్దుకుంటున్నాడు. బెంగాల్ టైగ‌ర్ త‌ర‌వాత మాత్రం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో గ్యాప్ వ‌చ్చేసింది. త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేనంత సుదీర్ఘ‌కాలం బ్రేక్ తీసుకొన్నాడు. ర‌వితేజ‌కు సినిమ‌ల్లేవా, అవ‌కాశాలు రావ‌డం లేదా అంటే అదీ కాదు. మ‌ధ్య‌లో రెండు మూడు ప్రాజెక్టులు సెట్ అయ్యేంత వ‌ర‌కూ వెళ్లి ఆగిపోయాయి.

ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ర‌వితేజ‌తో ప‌ని చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నా.. ర‌వితేజ మాత్రం ముందుకు క‌ద‌ల‌డం లేద‌ట‌. ర‌వితేజ దృష్టి ప్ర‌స్తుతం సినిమాల‌పై లేద‌ని, అందుకే.. సినిమాల్ని త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నాడ‌ని టాక్‌. ఈ విష‌యంపై పూరి ఇచ్చిన క్లారిటీ కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ఈమ‌ధ్య పూరి మాట్లాడుతూ ర‌వితేజ సినిమాల గురించి ఆలోచించ‌డం లేద‌ని, అత‌ను ప్ర‌పంచం చుట్టి రావాల‌నుకొంటున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. దాంతో ర‌వితేజ‌కు ఏమైంది? స‌డ‌న్ గా ఇంత మార్పేంటి? అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రవితేజ సన్నిహితులు, పీఆర్వోలు కూడా ఈ విష‌యంలో నోరు మెద‌ప‌డం లేదు. ర‌వితేజ అర్జెంటుగా ఓ సినిమా మొద‌లెడితేగానీ... ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌దు.