English | Telugu

భార‌తీయ చిత్ర‌సీమ‌లోని ప్ర‌తిభావంతులైన తార‌ల్లో ఒక‌రిగా గుర్తింపు పొందిన కొంక‌ణాసేన్ శ‌ర్మ‌, బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌వీర్ షోరే అధికారికంగా విడాకులు పొందారు. ఐదేళ్ల క్రిత‌మే ఆ ఇద్ద‌రూ విడిపోయారు. చాలా స్నేహ‌పూర్వ‌కంగా వాళ్ల‌కు విడాకులు మంజూర‌య్యాయ‌ని కొంక‌ణ ప్ర‌తినిధి అమృతా సాథే పాఠ‌క్ తెలిపారు. కొంక‌ణ‌, ర‌ణ‌వీర్ 2010లో పెళ్లి చేసుకున్నారు. 2011లో త‌మ‌కు పుట్టిన కుమారుడిని చూసుకోడానికి ఇద్ద‌రూ అంగీక‌రించారు.

ఆగస్ట్ 13 గురువారం వారికి విడాకులు మంజూర‌య్యాయ‌ని స‌మాచారం. ఇటీవ‌లి కాలంలో ఎలాంటి గొడ‌వ‌లూ లేకుండా ప్ర‌శాంతంగా విడాకులు పొందిన సినీ సెల‌బ్రిటీలు కొంక‌ణ‌, ర‌ణ‌వీర్‌లే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి శ‌త్రుత్వం క‌నిపించ‌లేద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఐదేళ్ల నుంచి విడివిడిగా ఉంటున్న ఆ ఇద్ద‌రూ తిరిగి క‌లిసి ఉండ‌టానికి ప్ర‌య‌త్నించ‌లేదు. ఎంత‌గా కౌన్సిలింగ్ నిర్వ‌హించినా ఫ‌లించ‌లేదు. ఆ ఇద్ద‌రికీ ఎనిమిదేళ్ల కొడుకు హ‌రూన్ ఉన్నాడు.

ట్రాఫిక్ సిగ్న‌ల్‌, మిక్స్‌డ్ డ‌బుల్స్‌, ఆజా నాచ్‌లే వంటి సినిమాల్లో క‌లిసి ప‌నిచేసే సంద‌ర్భంలో ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. తాము విడిపోయిన‌ట్లు 2015 సెప్టెంబ‌ర్‌లో కొంక‌ణాసేన్ ప్ర‌క‌టించారు. "విడిపోవాల‌ని ర‌ణ‌వీర్‌, నేను నిర్ణ‌యించుకున్నాం. అయితే మేం స్నేహితులుగా, మా అబ్బాయికి త‌ల్లిదండ్రులుగా కొన‌సాగుతాం" అని ఆమె చెప్పారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వారు విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.