Updated : Mar 7, 2025
తారాగణం: జి.వి. ప్రకాష్ కుమార్, దివ్యభారతి, సాబుమాన్ అబ్దుసమద్ తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం: కమల్ ప్రకాష్
నిర్మాతలు: జి.వి. ప్రకాష్ కుమార్, భవాని శ్రీ, ఉమేష్ బన్సల్
బ్యానర్: పారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్
విడుదల తేదీ: మార్చి 7, 2025
ఒక వైపు సంగీత దర్శకుడిగా సత్తా చాటుతూనే.. మరోవైపు హీరోగానూ అలరిస్తుంటాడు జి.వి. ప్రకాష్ కుమార్. ఆయన హీరోగా నటించిన 25వ చిత్రం 'కింగ్‌స్టన్'. సీ ఫాంటసీ అడ్వెంచర్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. (Kingston Movie Review)
కథ:
తమిళనాడు సముద్ర తీరంలోని తూవత్తూర్ అనే గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే.. శవాలై తిరిగొస్తారు. ఆత్మలే దానికి కారణమని ఆ ఊరి ప్రజల నమ్మకం. దీంతో చాలా ఏళ్లుగా ఎవరూ చేపల వేటకు వెళ్ళరు. కింగ్‌స్టన్(జి.వి. ప్రకాష్ కుమార్) సహా తూవత్తూర్ ఊరికి చెందిన పలువురు యువకులు థామస్(సాబుమాన్ అబ్దుసమద్) దగ్గర పని చేస్తుంటారు. అయితే థామస్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. దాని వల్ల ఒక యువకుడు చనిపోతాడు. దాంతో థామస్ ను ఎదిరించి ఆ ముఠా నుంచి బయటకు వస్తాడు కింగ్‌స్టన్. ఉపాధి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అందరూ వద్దని వారిస్తున్నా వినకుండా స్నేహితులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్తాడు కింగ్‌స్టన్. సముద్రంలోకి వెళ్ళాక ఏం జరిగింది? అసలు అక్కడున్న ఆత్మల కథ ఏంటి? కింగ్‌స్టన్ మరియు అతని స్నేహితులు క్షేమంగా తిరిగి వచ్చారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
సముద్రం నేపథ్యంలోని కథకు హారర్ ఎలిమెంట్స్ జోడించాలనే దర్శకుడు కమల్ ప్రకాష్ ఆలోచన బాగానే ఉంది. కానీ కథనం విషయంలోనే తడబడ్డాడు. కథను ముందుకి వెనక్కి తిప్పుతూ రిపీటెడ్ సీన్స్ తో గందరగోళానికి గురి చేశాడు. పైగా ఈ సినిమాలో ఆత్మలు, జాంబీలు, నిధి, లవ్, రివెంజ్ ఇలా పలు అంశాలను జోడించడంతో ప్రేక్షకులు దేనికీ పూర్తిగా కనెక్ట్ కాలేరు. ఆ ఊరిలో ఏదో జరుగుతోందన్న భయాన్ని కలిగిస్తూ సినిమాని ప్రారంభించిన తీరు బాగుంది. కానీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఉండవు. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా చెప్పగానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంటుంది. హీరో సముద్రంలో వేటకు వెళ్లే దగ్గర నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ ను పంచుతాయి. కానీ స్క్రీన్ ప్లేనే కాస్త గందరగోళంగా ఉంటుంది. అడ్వెంచర్, హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎమోషన్స్ మాత్రం తేలిపోయాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో జి.వి. ప్రకాష్ కుమార్ చక్కగా రాణించాడు. దివ్యభారతి ఉన్నంతలో తన మార్క్ చూపించింది. థామస్ పాత్రలో సాబుమాన్ అబ్దుసమద్ ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ గా కింగ్‌స్టన్ మూవీ గొప్పగా ఉంది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. పాటలు ఆకట్టుకోలేదు. డబ్బింగ్ క్వాలిటీ మెప్పించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా..
కింగ్‌స్టన్ కథాంశం బాగుంది. కానీ, ఒకే సినిమాలో ఎక్కువ అంశాలు ఇరికించడం, కథనంలో లోపాలు కారణంగా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2/5