Updated : Apr 30, 2022
వెర్సటైల్ స్టార్ జగపతి బాబు పలు రీమేక్స్ లో సందడి చేశారు. వాటిలో `పెదబాబు` ఒకటి. తమిళ సినిమా `పశుమ్ పొన్` (1995) (ప్రభు, శివాజీ గణేశన్, శివకుమార్, రాధిక, శరణ్య) ఆధారంగా రూపొందిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో `పెదబాబు`గా టైటిల్ రోల్ లో అలరించారు జగపతి బాబు. అతనికి జోడీగా కళ్యాణి నటించిన ఈ సినిమాలో కె. విశ్వనాథ్, సుహాసిని, శరత్ బాబు, విజయచందర్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్, దేవదాస్ కనకాల, వైజాగ్ ప్రసాద్, రాళ్ళపల్లి, లక్ష్మీపతి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రమేశ్ - గోపీ సంభాషణలు సమకూర్చారు. ఇందులో జగపతి బాబు - సుహాసిని మధ్య సాగే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను మెప్పించాయి.
చక్రి సంగీతమందించిన ఈ చిత్రానికి జాలాది, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యమందించారు. పాటల్లో ``నవ్వవయ్యా బాబు`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``బావ బావ``, ``ఒక వేకువ``, ``నాలో నువ్వుండాలి``, ``ఒక దేవుడు`` వంటి గీతాలు కూడా రంజింపజేశాయి. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మించిన `పెదబాబు`.. 2004 ఏప్రిల్ 30న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 18 వసంతాలు పూర్తిచేసుకుంది.
