Updated : Apr 30, 2022
'కేజీఎఫ్ చాప్టర్-2' మరో ఘనత సాధించింది. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ ఫీట్ సాధించిన నాలుగో సినిమాగా 'కేజీఎఫ్-2' నిలిచింది. అలాగే ఘనత సాధించిన మొదటి కన్నడ సినిమాగా సంచలనం సృష్టించింది.
తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలతో పోల్చితే కన్నడ పరిశ్రమ చిన్నది. అక్కడ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ సాధిస్తే గొప్పగా చెబుతారు. అలాంటిది ఏప్రిల్ 14 న విడుదలైన 'కేజీఎఫ్-2' అప్పుడే 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలలో 'బాహుబలి-2', 'దంగల్', 'ఆర్ఆర్ఆర్' మాత్రమే ఈ ఘనత సాధించాయి. కలెక్షన్ల పరంగా అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాలలో ప్రస్తుతం 'కేజీఎఫ్-2' నాలుగో స్థానంలో ఉంది. రూ.2,024 కోట్లతో 'దంగల్', రూ.1,810 కోట్లతో 'బాహుబలి-2', రూ.1,115 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
'కేజీఎఫ్-2' విడుదలై నేటికి 17 రోజులు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రోజుకి 15-20 కోట్ల గ్రాస్ రాబడుతున్న ఈ మూవీ త్వరలోనే 1100 కోట్ల క్లబ్ లో చేరి 'ఆర్ఆర్ఆర్'ని బీట్ చేసే అవకాశముందని అంటున్నారు. అదే జరిగితే అత్యధిక గ్రాస్ రాబట్టిన ఇండియన్ సినిమాల లిస్ట్ లో మూడో స్థానంలో 'కేజీఎఫ్-2', నాలుగో స్థానంలో 'ఆర్ఆర్ఆర్' నిలుస్తాయి.
