English | Telugu

‘బాహుబలి’ సిరీస్‌ షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లోనే మహాభారత గాధను సినిమాగా రూపొందించే ఆలోచన ఉందని దర్శకుడు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికి ఎంతో సమయం కేటాయించాల్సిన అవసరం వుందని కూడా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో చేసే సినిమాపైనే దృష్టి పెట్టిన రాజమౌళి ఈ సినిమా తర్వాత ఎవరితో ఏ సినిమా చేస్తాడో తెలీదు. అయితే మహాభారతం సినిమా చేయడం ఆయన డ్రీమ్‌ అనే విషయం తెలిసిందే. బహుశా మహేష్‌బాబు సినిమా తర్వాత ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన మహాబారత గాధను ఓ బాలీవుడ్‌ దర్శకుడు చేయబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. అతనెవరో కాదు, కశ్మీర్‌ ఫైల్స్‌, ది వాక్సీన్‌ వార్‌ చిత్రాలను రపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి.

కన్నడ రచయిత ఎన్‌.ఎల్‌.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని వివేక్‌ అగ్నిహోత్రి సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ‘పర్వ’ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇంత గొప్ప సినిమాని తెరకెక్కించడం తనకెంతో గర్వంగా ఉందని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరిస్తారు. మహాభారతం సినిమాని తెరకెక్కించాలని కలలు కంటున్న రాజమౌళికి వివేక్‌ అగ్నిహోత్రి గట్టి షాకే ఇచ్చాడు. మరి దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో, తన మహాభారతం ప్రాజెక్ట్‌ని పక్కన పెడతాడా? లేక తనదైన శైలిలో ఆ గాధని తెరకెక్కిస్తాడో చూడాలి.