English | Telugu

ఇలీయానా..టాలీవుడ్‌లో ఒకప్పటి నెంబర్‌వన్ హీరోయిన్. ‌దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సూపర్‌హిట్లతో అగ్రకథానాయకగా మారిన నటి. ఇక్కడ కెరిర్ ఒక రేంజ్‌లో ఉండగానే టాలీవుడ్‌ను పక్కనబెట్టి బాలీవుడ్ గడప తొక్కింది. రావడం రావడమే రణబీర్ కపూర్ సరసన బర్ఫీ మూవీలో నటించింది. ఆ సినిమా బాగానే ఆడి క్రెడిట్ అంతా రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా ఖాతాలోకి వెళ్లిపోవడంతో ఖంగుతింది. ఆ తర్వాత చేసిన ఏ సినిమా ఇల్లీబేబికి సరైన హిట్ ఇవ్వకపోవడంతో మళ్లీ హైదరాబాద్ వైపు చూసి మళ్లీ ఇక్కడ జెండా పాతడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే ఇటీవల అక్షయ్ కుమార్‌తో నటించిన రుస్తుం సూపర్‌హిట్ కావడంతో పాటు ప్రశంసలు..వరుస ఆఫర్లు రావడంతో ఇలియానా మళ్లీ మనసు మార్చుకుంది. అజయ్ దేవగణ్ హీరోగా మిలన్ తెరకెక్కుతున్న బాద్‌షాహో, అర్జున్ కపూర్, అనిల్ కపూర్ కలిసి నటించనున్న ముబారకన్ చిత్రాల్లోనూ ఇలియానా బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. దీంతో ఇక టాలీవుడ్‌కు పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్పాలని డిసైడైంది. ఇటీవల ఓ తెలుగు దర్శకుడు తన సినిమాలో హీరోయిన్‌ కోసం ఇలియానాను సంప్రదిస్తే..తాను ఇకపై తెలుగులో నటించనని ఆమె తేల్చిచెప్పిందట.