English | Telugu

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఆయన.. రచయితగా, దర్శకుడిగానూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఎక్కువ తెలుగు పదాలను ఉపయోగిస్తూ ఆయన రాసే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇతర భాషల్లో రూపొందుతోన్న భారీ చిత్రాల తెలుగు వెర్షన్ కు కూడా ఆయన డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.

2009లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'అవతార్'కి సీక్వెల్ గా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వస్తోంది. జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ అద్భుతం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ కి అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఇందులో అవసరాల డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్ కి కూడా అవసరాలనే డైలాగ్స్ అందించడం గమనార్హం.