Updated : Jan 11, 2021
తెలుగువారిని విశేషంగా అలరించిన కుటుంబ కథా చిత్రాల్లో సీతారామయ్య గారి మనవరాలు ముందువరుసలో ఉంటుంది. సీతారామయ్యగా మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాలో మనవరాలు సీతగా టైటిల్ రోల్ లో మీనా అభినయించారు.
రచయిత్రి మానస కలం నుంచి జాలువారిన నవ్వినా కన్నీళ్ళే నవల ఆధారంగా సీతారామయ్య గారి మనవరాలు చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు క్రాంతి కుమార్. వి.ఎం.సి. ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రంలో రోహిణి హట్టంగడి, దాసరి నారాయణ రావు, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, కమల్, తనికెళ్ళ భరణి, రాజా, తెలంగాణ శకుంతల, సుధా రాణి, మాస్టర్ అమిత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. ఇందులోని పాటలన్నీ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. పూసింది పూసింది పున్నాగ గీతమైతే ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది.
ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న సీతారామయ్య గారి మనవరాలు.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకుంది.
అలాగే మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయింది. 1991 జనవరి 11న విడుదలై విజయం సాధించిన సీతారామయ్య గారి మనవరాలు.. నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.