English | Telugu

ఇటీవల జరిగిన 'రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. "తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్‌ చేస్తే ఏం జరుగుతుందో మాకు తర్వాత తెలిసింది. అందుకే నేను, నా డైరెక్టర్‌ సాయిరాజేష్‌ తెలుగు రాని పరభాషా హీరోయిన్లనే ఎంకరేజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాము." అని ఎస్.కె.ఎన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేసినట్లు అనిపించింది. ఈ క్రమంలో ఎస్.కె.ఎన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. వేరే సినిమా ఈవెంట్ లో అసలు సంబంధం లేకుండా వైష్ణవిపై కామెంట్స్ చేయడం ఏంటని పలువురు ఎస్.కె.ఎన్ తీరుని తప్పుబట్టారు. ఒక తెలుగు నిర్మాతగా తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పాల్సింది పోయి.. తెలుగు అమ్మాయికి అవకాశం ఇవ్వొద్దు అనేలా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఎస్.కె.ఎన్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎస్.కె.ఎన్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు.

'డ్రాగన్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు హీరోయిన్ల గురించి తాను సరదాగా కామెంట్స్ చేశానని, వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఎస్.కె.ఎన్ అన్నాడు. "ఈమధ్య కాలంలో ఎక్కువ మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకడిని. నా కెరీర్ లో 80 శాతం తెలుగు అమ్మాయిలతోనే పని చేశాను. ఒక తెలుగు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నేను.. వివిధ విభాగాలలో కనీసం 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాను. ఆ ఈవెంట్ లో నేను సరదాగా అన్నాను. జోక్ ని జోక్ లా తీసుకోండి. దానిని ఒక స్టేట్మెంట్ లా తీసుకోకండి." అని ఎస్.కె.ఎన్ చెప్పుకొచ్చాడు.