Updated : Feb 18, 2025
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సాబిన్ షాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే రూపంలో ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ తోడవుతోంది. (Pooja Hegde)
ప్రస్తుతం పూజాకి తెలుగులో సినిమాలు లేవు. హిందీలో ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఈ క్రమంలో తమిళ సినిమాలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'రెట్రో', 'జన నాయగన్' వంటి తమిళ సినిమాలు ఉన్నాయి. ఇదే జోష్ లో ఇప్పుడు 'కూలీ'లో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ లో పూజాతో పాటు రజిని, నాగార్జున, ఉపేంద్ర చిందేయనున్నారని వినికిడి.
గతంలో తెలుగులో 'రంగస్థలం', 'ఎఫ్-3' సినిమాలలో పూజా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు తమిళ్ లో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఓ వైపు 'రెట్రో', 'జన నాయగన్' సినిమాలు, మరోవైపు 'కూలీ' స్పెషల్ సాంగ్ తో.. పూజ తమిళ్ లో సత్తా చాటుతుందేమో చూడాలి.