English | Telugu

తారాగ‌ణం : నాగ‌శౌర్య‌, క‌ష్మీర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, అజ‌య్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, శివాజీరాజా, సుధ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌: ఉషా మూల్పూరి
కెమెరా: విజ‌య్ సి కుమార్‌
సంగీతం: మ‌హిత్ స్వ‌ర‌సాగ‌ర్‌
సంస్థ‌: ఐరా క్రియేష‌న్స్‌

న‌పుంస‌క పాత్ర‌ల్ని సృష్టించి వాటి చుట్టూ చ‌క్క‌టి వినోదాన్ని అల్లుకోవ‌డం తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి ఉంది. అయితే క‌థానాయ‌కుడి పాత్ర‌ను న‌పుంస‌కుడిగా (గే) చూపిస్తూ క‌థ‌ను న‌డిపించిన సినిమాలు అరుదుగా వ‌చ్చాయి. స‌మ‌కాలీన బాలీవుడ్ సినిమాలో ఈ త‌ర‌హా పాత్ర‌ల‌తో సినిమాల రూప‌క‌ల్ప‌న ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దోస్తానా వంటి సినిమాలు హిందీలో చ‌క్క‌టి విజ‌యాన్ని సాధించాయి కూడా. ఇలాంటి కాన్సెప్ట్‌ల‌కు వినోద‌మే ప్ర‌ధాన బ‌లం. ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్‌ చేస్తున్నామ‌నే విష‌యం మీద‌నే సినిమా ఫలితం ఆధార‌ప‌డి ఉంటుంది. తాజాగా యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య @న‌ర్త‌న‌శాల అంటూ గే క‌థాంశంతో సాహ‌సానికి సిద్ధ‌ప‌డ్డారు. నిర్మాణం నుంచే ఈ సినిమా టైటిల్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. అల‌నాటి క్లాసిక్ టైటిల్ కావ‌డంతో ఈ సినిమా క‌థాంశ‌మేమిటో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఎక్కువైంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనే నాగ‌శౌర్య నపుంస‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ సినిమా న‌చ్చ‌క‌పోతే చూడొద్దు. న‌చ్చితే ప‌దిమందికి చెప్పండి అంటూ నాగ‌శౌర్య ప్ర‌క‌టించండం కూడా సినిమాపై అంచ‌నాల్ని పెంచింది. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన @న‌ర్త‌న‌శాల ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే క‌థా వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే..

క‌థ‌:

ఆడ‌వాళ్లంటే ఎంతో గౌర‌వం క‌లిగిన రాధాకృష్ణ (నాగ‌శౌర్య‌) ఓ మ‌హిళా సాధికార సంస్థ‌ను న‌డుపుతుంటాడు. మార్ష‌ల్ ఆర్ట్స్ వంటి స్వీయ‌ర‌క్ష‌ణ విద్య‌లో వారికి శిక్ష‌ణ ఇస్తుంటాడు. ఆడ‌వారు స్వ‌శ‌క్తితో ప్ర‌తి స‌మ‌స్య‌ను ఎదిరించాల‌ని కోరుకుంటాడు. ఓ సంద‌ర్భంలో మాస‌న (క‌ష్మీర ప‌ర‌దేశి) అనే యువతిని ఓ స‌మ‌స్య నుంచి బ‌య‌ప‌డేస్తాడు. దాంతో రాధాకృష్ణ‌పై మాన‌స ఇష్టం పెంచుకుంటుంది. ఆ త‌ర్వాత రాధాకృష్ణ‌కు అనుకోకుండా స‌త్య‌భామ (యామినీ భాస్క‌ర్‌) అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. మహిళ‌లంటే రాధాకృష్ణ‌కున్న గౌర‌వాన్నితెలుసుకొని ప్రేమిస్తుంది. రాధాకృష్ణ తండ్రి క‌ళామందిర్ కల్యాణ్ (శివాజీరాజా) చేసిన చిన్న పొరపాటు వ‌ల్ల రాధాకృష్ణ..స‌త్య‌భామ‌ను పెళ్లాడాల్సిన పరిస్ఙితి వ‌స్తుంది. పెళ్లి నుంచి బ‌య‌టప‌డ‌టానికి స‌త్య‌భామ తండ్రి రాయుడు (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి)కి తాను నపుంస‌కుడిన‌ని అబ‌ద్ధం చెబుతాడు రాధాకృష్ట‌. ఈ క్ర‌మంలో ఏం జరిగింది? మాన‌స‌, స‌త్య‌భామ‌కు ఉన్న సంబంధం ఏమిటి? రాయుడు ఇంటిలో రాధాకృష్ణ ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నాడు? చివ‌ర‌కు ఎలా భ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌దే మిగ‌తా చిత్ర క‌థ‌..

విశ్లేష‌ణ‌..

క‌థానాయ‌కుడిని గే పాత్రలో డీల్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. క‌థ‌తో పాటు హీరో పాత్ర చిత్ర‌ణ‌, వినోదం స‌మ‌పాళ్ల‌లో కుదిరితేనే ఇలాంటి కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లో గే అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను మేళ‌వించి ఈ క‌థ‌ను చెప్పాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే ఈ రెండు అంశాల్లో దేనిని స‌మ‌ర్థ‌వంతంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయాడు. క‌థాగ‌మ‌నంలో అన్నీ లోపాలే క‌నిపిస్తాయి. మాన‌స‌-రాధాకృష్ణ ప్రేమ ఎపిసోడ్‌లో ఎలాంటి ఫీల్ ఉండ‌దు. రాధాకృష్ణ‌తో సత్య‌భామ పెళ్లికి ఒప్పుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మొక్క‌టీ క‌నిపించ‌దు. ఇక ప్ర‌థ‌మార్థంలో స‌త్యంరాజేష్ కామెడీ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. న‌వ్వుల‌కు బ‌దులు ఆవ‌లింత‌లు వ‌చ్చేలా చేసింది. అజ‌య్ పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్‌ను ఓ మ‌ర్డ‌ర్‌తో చూపిస్తారు. ఆ త‌ర్వాత అత‌ను తాను గే అంటూ రాధాకృష్ణ వెంట‌ప‌డ‌టం ఆ పాత్ర‌ను పేల‌వంగా తీర్చిదిద్దిన విధానానికి అద్దం ప‌డుతుంది. విసుగెత్తించే స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్థ‌మంతా కంగాళీగా సాగింది. అస‌లు క‌థానాయిక‌లు కేవ‌లం పాట‌ల కోస‌మే ఉన్నార‌నిపించింది. క‌థానాయ‌కుడు తాను గే అని అబ‌ద్ధం చెప్పిన‌ప్పుడు అత‌ని పాత్ర‌లో కావాల్సినంత వినోదాన్ని పండించ‌డానికి ఆస్కారం ఉంది. అయితే ద‌ర్శ‌కుడు అటువంటి ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పైగా అజ‌య్‌, నాగ‌శౌర్య మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కామెడీని పండిచ‌క‌పోగా చిరాకును తెప్పిస్తాయి. గే పాత్ర అంటే కేవ‌లం ఒక‌టిరెండు ఎక్స్‌ప్రెష‌న్్స ఇస్తే చాల‌న్నట్లు నాగ‌శౌర్య‌ న‌ట‌న సాగింది. మాస‌న త‌న కుటుంబానికి 22ఏళ్లు ఎందుకు దూరంగా ఉందో చెప్పే కార‌ణాలు అర్ధ‌ర‌హితంగా అనిపిస్తాయి. సంభాష‌ణ‌లు పేల‌వంగా సాగాయి. కొన్ని స‌న్నివేశాలు కామెడీ పేరుతో హింసిస్తున్నార‌నే భావ‌న క‌లిగిస్తాయి. అగ్నిప‌ర్వతం మీద ఆస‌నం వేసిట‌న‌ట్లుగా వుంద‌ని సినిమాలో ఓ క‌మెడియ‌న్ డైలాగ్ చెబుతాడు. ప్రేక్ష‌కుల ప‌రిస్థితిని ఆ సంభాష‌ణ‌తో పోల్చుకోవ‌చ్చు.

న‌టీన‌టుల ప‌నితీరు..

కెరీర్ ఆరంభం నుంచి చ‌క్క‌టి క‌థ‌ల్ని ఎంచుకుంటున్నాడు నాగ‌శౌర్య‌. న‌ర్త‌న‌శాల మాత్రం త‌ప్ప‌కుండా రాంగ్ ఛాయిస్‌లా మిలిగిపోతుంది. నాగ‌శౌర్య పాత్ర చిత్ర‌ణ‌లో ఎక్క‌డా ఫీల్ క‌నిపించ‌లేదు. ఏదో య‌థాలాపంగా తెర‌పై క‌నిపించాడ‌నిపిస్తుంది. నాగ‌శౌర్య గ‌త చిత్రాల‌ను ప‌రిశీలిస్తే వినోద‌మే అత‌ని బ‌ల‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాలో అది మిస్ కావ‌డంతో అత‌ని పాత్ర తేలిపోయింది. ఇక క‌థానాయిక‌లు యామిని భాస్క‌ర్‌, క‌ష్మీరా ప‌ర‌దేశిల‌కు అభిన‌యించ‌డానికి ఏ మాత్రం అవ‌కాశం లేకుండా పోయింది. వారిద్ద‌రు కేవ‌లం పాట‌లు, ఏవో కొన్ని స‌న్నివేశాల‌కు ప‌రిమిత‌మైపోయారు. సినిమాలో కొంచెం రిలీఫ్‌గా ఫీలై న‌వ్వుకునేది జ‌య‌ప్రకాష్‌రెడ్డి క‌నిపించిన‌ప్పుడు మాత్ర‌మే. సాధార‌ణ డైలాగ్‌ను కూడా త‌నదైన టైమింగ్‌తో ప‌లికించి న‌వ్వుల్ని పండించ‌డం ఆయ‌న శైలి. అందుకు త‌గిన‌ట్టే జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి డైలాగ్స్‌లో కొన్ని చ‌క్క‌టి వినోదాన్ని పంచాయి. క‌థానాయ‌కుడి తండ్రి పాత్ర‌లో శివాజీరాజా కొంచెం అతి చేశాడ‌నిపించింది. మిగ‌తా పాత్ర‌ల గురించి పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి ఏమి లేదు. సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. గ‌ర్తుంచుకునే రీతిలో ఒక్క‌పాట కూడా లేదు. విజ‌య్ సి కుమార్ ఛాయాగ్ర‌హణం బాగుంది. కొన్ని విజువ‌ల్స్‌లో కెమెరా ప‌నిత‌నం క‌నిపించింది. ఐరా క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు..

ఏమాత్రం లాజిక్‌కు అంద‌ని గ‌తి త‌ప్పిన కామెడీ క‌థ ఇది. రెండున్న‌ర‌గంటల పాటు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా నిలుస్తుంది. ఛ‌లో చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న నాగ‌శౌర్య ఈ సినిమాతో నిరాశ‌చెంద‌డం ఖాయం.

రేటింగ్ : 1.25