Updated : Jun 4, 2021
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తన కెరీర్ ఆరంభంలో కొన్ని ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు. వాటిలో `జ్యోతి` ఒకటి. `సహజనటి` జయసుధ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా.. కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అలాగే, `ఉత్తమ నటి`గా తొలి `నంది` పురస్కారాన్ని, `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందించింది. జయభాదురి టైటిల్ రోల్ లో నటించిన హిందీ చిత్రం `మిలి` (1975) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని.. మాతృక కంటే భిన్నంగా, ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జ్యోతి (జయసుధ) అనే యువతి.. తన తండ్రి వయసు ఉన్న రాజయ్య(గుమ్మడి)ని పెళ్ళిచేసుకుంటుంది. ఆ తరువాత ఆమెకి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో `జ్యోతి` చిత్రం నడుస్తుంది.
మురళీ మోహన్, రావు గోపాల రావు, కృష్ణకుమారి, గిరిబాబు, ఛాయాదేవి, జేవీ సోమయాజులు, కైకాల సత్యనారాయణ, శుభ, `ఫటాపట్` జయలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సమకూర్చిన పాటలు ప్రధాన బలంగా నిలిచాయి. ``సిరిమల్లె పువ్వల్లే నవ్వు``, ``నీకూ నాకూ పెళ్ళంట``.. వంటి గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. క్రాంతి కుమార్ నిర్మించిన `జ్యోతి`.. 1976 జూన్ 4న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ సినిమా 45 వసంతాలు పూర్తిచేసుకుంది.