Updated : Mar 28, 2022
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పరిచయం చేసిన కథానాయకుల్లో.. కొంతమంది కాలక్రమంలో స్టార్ డమ్ చూశారు. వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. రాఘవేంద్రరావు వందో చిత్రంగా రూపొందిన `గంగోత్రి`తో బన్నీ హీరోగా మొదటి అడుగేశారు. నటనలో, నర్తనంలో తనదైన బాణీ పలికించి.. తొలి సినిమాతోనే శుభారంభాన్ని చూశారు. అలాగే, `ఉత్తమ నూతన కథానాయకుడు`గా `నంది` అవార్డుని సైతం అందుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ కి జంటగా నటించిన ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ కి కూడా ఇదే ఫస్ట్ పిక్చర్ కావడం విశేషం. ప్రకాశ్ రాజ్, సుమన్, సీత, ప్రగతి, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తెలంగాణ శకుంతల, ఏవీయస్, బెనర్జీ, మాస్టర్ తేజ, బేబి కావ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి చిన్ని కృష్ణ కథను అందించారు.
స్వరవాణి కీరవాణి బాణీలు `గంగోత్రి`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``నువ్వు నేను కలిసుంటేనే``, ``ఒక తోటలో``, ``వల్లంకి పిట్ట``, ``గంగా``, ``రైలు బండి``, ``మావయ్యది మొగల్తూరు``, ``జీవన వాహిని``.. ఇలా ఇందులోని గీతాలన్ని రంజింపజేశాయి. అల్లు అరవింద్, సి. అశ్వనీ దత్ సంయుక్తంగా నిర్మించిన `గంగోత్రి`.. 2003 మార్చి 28న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 19 వసంతాలు పూర్తిచేసుకుంది.
