Updated : Jan 4, 2015
అడుసుమిల్లి జనార్థన వర ప్రసాద్ అంటే... ఆయనెవరూ...?? అనుకొంటారంతా. ఆహుతి ప్రసాద్ అంటే మాత్రం చటుక్కున గుర్తొస్తారు! ''భలేటి నటుడండీ.. ఏ క్యారెక్టరిచ్చినా పండించేత్తారు..'' అనిపించుకొన్న సత్తా ఉన్న నటుడు.ఏ నటుడైనా సరే, తాను చేసిన పాత్ర పేరుతోనే, సినిమా పేరుతోనో పాపులర్ అయితే ఆ నటుడికి సత్తా ఉన్నట్టే. అలా.. తొలి సినిమా 'ఆహుతి'ని తన ఇంటి పేరుగా మార్చేసుకొన్నాడు.
తొలి సినిమాకి పేరొచ్చినంత మాత్రాన అవకాశాలు రావాలని రూలెక్కడుంది..? అందుకే ఆహుతి ప్రసాద్‌కి ఛాన్సులు చుట్టపు చూపుగానే వచ్చాయి. యేడాదికి ఒకటీ ఆర అవకాశాలతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. కృష్ణవంశీ సినిమా `నిన్నే పెళ్లాడతా`తో ఆయన కెరీర్ టర్న్ అయ్యింది. సహాయక పాత్రలు, సైడ్ విలన్, పోలీస్ పాత్రలు ఆయన్ని వెతుక్కొంటూ వచ్చేవి. 250 సినిమాల్లో నటిస్తే... అందులో కనీసం వంద చిత్రాల్లో ఆయన పోలీస్‌గానే కనిపించాడు. చందమామ సినిమాతో ఆయన కెరీర్ జెట్ స్పీడులోకి దూసుకెళ్లింది. అందులో రామలింగేశ్వరరావులా అదరగొట్టేశాడు. గోదావరి యాసలో ఆయన పలికిన సంభాషణలు, బాడీ లాంగ్వేజ్ ఆయనకు నంది అవార్డునీ తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో.... టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. బెండు అప్పారావు, సిద్దూ ఫ్రమ్ సికాకుళం, కొత్త బంగారు లోకం.. సినిమాలూ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ మామూలే. ఆహుతి కెరీర్ డౌన్లో ఉన్నప్పుడల్లా ఓ మంచి అవకాశం వచ్చేది. దాన్నీ ఆయన అందుపుచ్చుకొన్నాడు.చందమామతో.. తిరుగులేని స్థానం సంపాదించుకొన్నాడు. ఆయన సంపాదనలో పడింది కూడా ఇప్పుడిప్పుడే. అంతలోనే... తెలుగు సీమ ఆయన్ని దూరం చేసుకొంది.
ఆహుతి ప్రసాదేంటి..?? పేరులో ఆహుతి ఉంటే బాగోదు మార్చుకో అని చాలామంది సన్నిహితులు ఆయనకు సలహా ఇచ్చారు. కానీ తనకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పేరుని ఆయన వదల్లేదు. అవకాశాల్లేనప్పుడు కూడా సినిమాపై ప్రేమని పెంచుకొంటూ వెళ్లారు. ఆ ప్రేమే.. ఆయనకు తెలుగు చిత్రసీమలో మంచి స్థానాన్ని అందించింది. బాబాయ్, నాన్న, అన్నయ్య, పోలీస్, సైడ్ విలన్... ఇలా ప్రతి పాత్రకీ న్యాయం చేశారాయన. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ పాత్ర వేస్టు అనిపించుకొనేలా ఒక్కసారీ కనిపించలేదు.
ఆహుతి ప్రసాద్‌కి ఆత్మాభిమానం ఎక్కువ. ఎంతంటే తన అనారోగ్యాన్నీ దాచుకొన్నారు.
ఏంటి సార్ ఒంట్లో బాలేదట.. అని ఎవరైనా అడిగితే ''నాకు బాలేకపోవడమేంటి...?? నేను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టేమో గానీ, రియల్ లైఫ్‌లో హీరో..'' అనేవారట.
క్యాన్సర్ బారీన పడి బక్కచిక్కిపోయిన ఆహుతిని చూసి ''ఏంటి సార్ ఇలాఅయిపోయారు'' అని అడిగితే ''క్యారెక్టర్ కోసం లేవోయ్... ఆ మాత్రం హార్ట్ వర్క్ ఉండొద్దూ'' అని కప్పిపుచ్చుకొనేవారట.
చివరో రోజుల్లో ఇక క్యాన్సర్‌ని జయించడం కష్టమని తెలిసి.. సినిమాలకు దూరమై ఇంట్లోనే ఉండిపోయారు. పలకరింపులూ, పరామర్శలు లేవు. ప్రతి నిమిషం తన కుటుంబంతోనే. రెండో కుమారుడ్ని హీరోగా చూసుకోవాలని ఉండేది. అందుకోసం ప్రయత్నాలూ చేశారు. మరిన్ని పాత్రలు ఆహుతి ప్రసాద్ కోసం పుడుతున్నప్పుడే.... వాటిని వదిలి హడావుడిగా వెళ్లిపోయారు ఆహుతి ప్రసాద్!
ఆహుతి ప్రసాద్.. వియ్ మిస్ యూ సార్..!