Updated : Oct 9, 2021
తెలుగునాట `ద్విపాత్రాభినయం` అనే మాట వినగానే ఠక్కున గుర్తొచ్చే కథానాయకుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. తన కెరీర్ లో ఇప్పటివరకు 16 చిత్రాల కోసం డ్యూయెల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేశారు బాలయ్య. కాగా వాటిలో `అపూర్వ సహోదరులు`కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాతోనే తన నటజీవితంలో `ద్విపాత్రాభినయం` అనే అంకానికి శ్రీకారం చుట్టారు ఈ నందమూరి అందగాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, రాముగా కవల సోదరుల పాత్రల్లో తనదైన అభినయంతో అభిమానులను అలరించారు బాలకృష్ణ. విజయశాంతి, భానుప్రియ నాయికలుగా నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, రంగనాథ్, చలపతి రావు, సుత్తివేలు, అన్నపూర్ణ, డబ్బింగ్ జానకి, శుభ, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``స్వప్న ప్రియ స్వప్నా``, ``దొంగవా దోచుకో`` విశేషాదరణ పొందగా.. ``మై డియర్ రంభా``, ``అప్పలమ్మ ఆడితే``, ``పిడుగంటి పిల్లోడు`` కూడా రంజింపజేశాయి. ఆర్. కె. అసోసియేట్స్ పతాకంపై రాఘవేంద్రరావు సోదరుడు కె. కృష్ణ మోహన రావు నిర్మించిన `అపూర్వ సహోదరులు`.. 1986 విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదలైంది. నేటితో ఈ సక్సెస్ ఫుల్ మూవీ 35 వసంతాలను పూర్తిచేసుకుంది.