Updated : Mar 23, 2023
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగమార్తాండ' చిత్రం ఉగాది కానుకగా మార్చి 22న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ఇందులో చక్రపాణిగా బ్రహ్మానందం నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకాలం హాస్యబ్రహ్మగా అలరించిన ఆయనలో ఇంత గొప్ప నటుడు మరుగున పడిపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'రంగమార్తాండ' చూసిన వారంతా ముందుగా బ్రహ్మానందం నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా సత్కరించారు.
రామ్ చరణ్ తన 15వ సినిమాని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్ లో బ్రహ్మానందాన్ని శాలువాతో సత్కరించిన చిరంజీవి, రామ్ చరణ్.. 'రంగమార్తాండ' సినిమాకి, అందులో ఆయన నటనకు వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా 'రంగమార్తాండ' సినిమాలో చిరంజీవి కూడా భాగం కావడం విశేషం. 'నేనొక నటుడిని' అంటూ చిరంజీవి చెప్పిన షాయరీతోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది.
బ్రహ్మానందాన్ని చిరంజీవి, చరణ్ సత్కరించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో చరణ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంచెకట్టు, మెడలో లాకెట్, విభిన్న హెయిర్ స్టైల్ తో చరణ్ లుక్ ఆకట్టుకుంటోంది.