English | Telugu

విక్టరీ వెంకటేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌లతో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. 2013లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అనుబంధాలు, ఆప్యాయతలు కలగలిసిన చక్కని కుటుంబ కథతో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ అన్నదమ్ములుగా నటించారు. అయితే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఇద్దరికీ పేర్లు అనేవి ఉండవు. పెద్దోడు అంటే వెంకటేష్‌, చిన్నోడు అంటే మహేష్‌. సినిమా అంతా ఇలాగే సాగుతుంది. అయితే చివరలో కూడా వారి పేర్లు రివీల్‌ చెయ్యలేదు. ఇద్దరు టాప్‌ హీరోలకు సినిమాలో పేర్లు పెట్టకుండా ఘనవిజయాన్ని అందుకున్న ఘనత శ్రీకాంత్‌ అడ్డాలకు దక్కుతుంది.

వెంకటేష్‌, మహేష్‌తోపాటు ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అంజలి, సమంత, అభినయ వంటి నేచురల్‌ ఆర్టిస్టులు తమ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. సినిమాలో ఎన్నో ఎమోషనల్‌ సీన్స్‌ ఉంటాయి. ఆ సమయంలో కూడా హీరోల పేర్లను రివీల్‌ చెయ్యలేదు. మనసును తట్టి లేపే కథ, కథనాలతో సాగిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని కలిగించింది. మరోసారి ఆ అనుభూతిని కలిగించేందుకు మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని రీరిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఇప్పటికే టీవీలో లెక్కకు మించిన సార్లు వచ్చిన ఈ సినిమాకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇంతకీ ఈ సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ పేర్లు ఏమిటంటే.. పెద్దోడి పేరు మల్లికార్జున, చిన్నోడు సీతారామరాజు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇవే పేర్లు పెట్టాడట. అయితే స్టోరీ డెవలప్‌మెంట్‌ టైమ్‌లో రాముడు, లక్ష్మణుడు అని పేర్లు పెట్టాలనుకున్నారు. అది కూడా కరెక్ట్‌ కాదు అనుకొని ఫైనల్‌గా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు కన్‌ఫర్మ్‌ చేశారు. ఇదీ పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్ల వెనుక ఉన్న అసలు కథ.