సాయంలో ముందుండే సినీ స్టార్లు.. జ‌గ‌న్ దెబ్బ‌కు అంతా దిగాలు..

కొవిడ్ వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల‌ను వ‌ణికించింది. లాక్‌డౌన్‌తో యావ‌త్ స‌మాజం స్థంభించింది. ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ప్ర‌భుత్వాల‌కు చిల్లిగ‌వ్వ కూడా ఆదాయం లేదు. అప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చారు తెలుగు సినిమా హీరోలు. భారీ విరాళాల‌తో రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జ‌ల‌కు చేయూత అందించారు. రెబెల్ స్టార్ ప్ర‌భాస్ అంద‌రికంటే అధికంగా 4 కోట్ల విరాళం ఇచ్చారు. పీఎం రిలీప్ ఫండ్‌కు 3 కోట్లు.. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు చ‌రో 50 ల‌క్ష‌లు డొనేష‌న్ అందించారు. రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ప్ర‌భాస్ అనే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ 2 కోట్లు.. మ‌హేశ్‌బాబు కోటి.. రామ్‌చ‌ర‌ణ్ 70 ల‌క్ష‌లు.. బ‌న్నీ 50 ల‌క్ష‌లు.. ఎన్టీఆర్ 25 ల‌క్ష‌లు.. ఇలా ఇలా అనేక మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు చేతికి ఎముకే లేన‌ట్టు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తెలుగు రాష్ట్రాల‌కు అండ‌గా నిలిచారు. తాజాగా, రాయ‌ల‌సీమ వ‌ర‌ద బాధితుల కోస‌మూ మేముసైత‌మంటూ ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, బ‌న్నీ, అల్లు అర‌వింద్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు డొనేష‌న్లు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ద‌ర బాధితుల‌కు ఆస‌రాగా నిలిచారు. 

ఇంతా చేస్తే.. బ‌దులుగా జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఏం చేసింది? తెలుగు సినిమాను చంపే ప్ర‌య‌త్నం చేస్తోందంటున్నారు. అగ్ర హీరోల‌ను, పెద్ద సినిమాల‌ను ఆర్థికంగా దెబ్బ కొడుతోంద‌ని మండిప‌డుతున్నారు. కొవిడ్ క్రైసిస్‌, సీమ ఫ్ల‌డ్స్ అనే కాదు.. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా.. ఎలాంటి విప‌త్తు దాపురించినా.. అంద‌రికంటే ముందు వ‌రుస‌లో సాయానికి ముందుకొచ్చింది సినిమా వాళ్లే. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ములో.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చింది టాలీవుడ్ వారే. అలాంటి సినిమానే దెబ్బ తీసే చ‌ర్య‌ల‌కు పూనుకుంటే..? బెనిఫిట్ షోలు ర‌ద్దు చేస్తే..? టికెట్ రేట్లు బాగా త‌గ్గిస్తే..? సినిమా వాళ్ల ఆర్థిక మూలాల‌ను దారుణంగా దెబ్బ కొడితే..? ఎవ‌రికి న‌ష్టం? నేరుగా సినిమా రంగమే నాశ‌నం అయినా.. హీరోలు, నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, డిస్టిబ్యూట‌ర్లు, థియేట‌ర్లు.. ఇలా అన్నీ వ్య‌వ‌స్థ‌లు ఆర్థికంగా ప‌త‌న‌మైనా.. ఈ న‌ష్టం ప‌రోక్షంగా తెలుగు ప్ర‌జ‌ల‌పైనా ఎంతోకొంత ప్ర‌భావం చూప‌క‌మాన‌దు. టికెట్ మీద వ‌చ్చే రూపాయో, రెండు రూపాయ‌ల ప‌న్ను కోస‌మో.. జ‌గ‌న్‌రెడ్డి ఇంత‌లా పంతానికి పోవ‌డం వ‌ల్ల‌.. మొత్తం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ దెబ్బ తినే ప్ర‌మాదం లేక‌పోలేదంటున్నారు. 

స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌..

ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోతే.. ప‌రోక్షంగా హీరోలూ లాస్ అవుతారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఇప్ప‌టికే అఖండ క‌లెక్ష‌న్ల‌కు కోత‌లు పెట్టాయంటున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న‌.. పుష్ప‌, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్‌, రాథేశ్యామ్‌, ఆచార్య‌.. సినిమా వ‌సూళ్లు దారుణంగా దెబ్బతినే ప్ర‌మాదం ఉందంటున్నారు. రాథేశ్యామ్ క‌లెక్ష‌న్లు త‌గ్గితే.. ప్ర‌భాస్ గ‌తంలో మాదిరి మ‌రోసారి 4 కోట్ల విరాళం ఇవ్వ‌గ‌ల‌రా? ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ టార్గెట్ చేస్తే.. క‌రోనా కాలంలో ఇచ్చిన‌ట్టు 2 కోట్లు డొనేష‌న్ ఇవ్వ‌డం పీకేకు కుదురుతుందా?  పుష్ప బెనిఫిట్ షోలు ఆపితే బ‌న్నీ.. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల‌కు కోత పెడితే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు ఇక‌పై అన్నేసి ల‌క్ష‌లను సాయంగా ఇవ్వ‌డం సాధ్య‌మ‌య్యేనా? ఏళ్లుగా ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మేమున్నామంటూ ముందుకొచ్చే సినీ ప‌రిశ్ర‌మ‌ను జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ఇంత‌లా టార్గెట్ చేయ‌డం.. టార్చ‌ర్ చేయ‌డం.. స‌మంజ‌స‌మేనా?  సాయం చేసే చేతుల‌ను క‌లెక్ష‌న్ల సంకెళ్లతో బంధించ‌డం జ‌గ‌న‌న్న‌కు త‌గునా? అని ప్ర‌శ్నిస్తున్నాయి సినీ వ‌ర్గాలు. వారి నుంచి సాయం పొందిన బాధిత జ‌నాలు.