స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌..

బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ హిట్‌. అఖండ.. అఖండ విజ‌యం సాధిస్తుందంటూ రివ్యూలు. బాల‌కృష్ణ యాక్ష‌న్ అదుర్స్ అంటున్నారంతా. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదంట‌. ఇలా, అఖండ హిట్‌తో అంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు కొంద‌రు త‌ప్ప‌. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో.. బెనిఫిట్ షోలు లేక బేజార‌వుతున్నారు. టికెట్ ధ‌ర‌లు మ‌రీ చీప్‌గా ఉండ‌టంతో హౌజ్‌ఫుల్ అవుతున్నా క‌లెక్ష‌న్లు యావ‌రేజ్‌గా ఉంటున్నాయి. మ‌రీ 5 రూపాయ‌ల‌కే నేల టికెట్ దొరుకుతోంది. క‌నీసం క‌రెంట్ బిల్లుల‌కు కూడా వ‌ర్క‌వుట్ అవ‌డం లేదంటూ గ‌గ్గోలు మొద‌లైంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత‌.. అంతా దిగాలుగా ఉన్నారు. అఖండ ఫ్యాన్స్‌కు మాత్ర‌మే హిట్‌. సినిమాకు, ఇండ‌స్ట్రీకి పెద్ద న‌ష్టం. జ‌గ‌న‌న్న కొట్టిన తొలిదెబ్బ అఖండ‌ను ఆగ‌మాగం చేస్తోంది. ఇక ముందుముందు పుష్ప‌, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్‌, రాథేశ్యామ్‌, ఆచార్య‌ల‌పైనా దారుణంగా ప్ర‌భావం చూప‌నుంది. ఇలా, జ‌గ‌న్‌రెడ్డి చేతివాటానికి ఏపీలో టాలీవుడ్ ల‌బోదిబోమంటోంది. 

సినిమాపై జ‌గ‌న్‌రెడ్డికి ఎందుకింత క‌క్ష్య‌? ఎందుకింత మొండి ప‌ట్టుద‌ల‌? ఎందుకింత‌లా వేధింపులు? ఇండ‌స్ట్రీ ఏమ‌న్నా గొంతమ్మ కోరిక‌లు కోరిందా? ఫ‌స్ట్ వీక్ కొన్ని బెనిఫిట్ షోస్‌.. టికెట్ రేట్ల‌లో కాస్త పెంపుద‌ల‌.. అంతేగా. ఆన్‌లైన్ టికెటింగ్‌కు ఓకే అన్నారుగా. అయినా, ఎందుకోగాని జ‌గ‌న్‌రెడ్డి పంతం వీడ‌టం లేదు. చిరంజీవి వేడుకున్నా క‌నిక‌రించ‌లేదు.. నాగార్జున స్వయంగా వెళ్లి రిక్వెస్ట్ చేసినా దిగిరాలేదు.. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు విజ్ఞప్తి చేసినా ఉప‌యోగం లేదు. ప‌రిశ్ర‌మ‌ను స‌ర్వ‌నాశ‌నం చేయ‌డ‌మే ఆయ‌న టార్గెట్ కావొచ్చు అంటున్నారు. 

గ్రామ పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకానమీ టికెట్‌ ధర 5 రూపాయలే! అదే ఏసీ థియేటర్‌ అయితే.. 10 రూపాయలు. పట్టణాలు, నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల లో ప్రీమియం, డీలక్స్‌ క్లాస్‌ల ధరల పట్ల కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ.. మిగిలిన అన్ని ధరలు గిట్టుబాటు కావని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 1200కి పైగా థియేటర్లున్నాయి. వాటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. వ‌కీల్‌సాబ్ నుంచి బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. రోజుకు నాలుగు ఆటలకు మించకూడదని తేల్చి చెప్పింది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్రవేశపెడుతూ సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేసింది. సినిమా టికెట్ల కొత్త రేట్లను నిర్ణయించింది. అఖండ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా.. పాత సర్క్యులర్‌ను మరోసారి థియేటర్ల యజమానులకు గుర్తు చేసింది వైసీపీ ప్ర‌భుత్వం. 

క‌ఠిన రూల్స్‌తో సర్కారు వారి తొలిదెబ్బ ‘అఖండ’కే తగులుతోంది. బయ్యర్లు ‘అఖండ’ నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి.. సినిమా రేట్‌ను 20 నుంచి 25 శాతం వరకూ తగ్గించేలా ఒత్తిడి చేశారు. దీంతో.. అఖండ‌తో పది కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ వస్తుందనుకున్న నిర్మాత‌.. 5 కోట్లతో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ న‌ష్టం ‘అఖండ’తోనే ఆగిపోయేలా లేదు. త్వ‌ర‌లోనే రానున్న‌ ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రాథేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల‌ను దారుణంగా దెబ్బ‌తీయ‌నుంది. సినిమాను దెబ్బ తీసి.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం బాగుప‌డేది ఏముందో ఆయ‌న‌కే తెలియాలి అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌ను సినిమా పాలిట‌ విల‌న్‌గా చూస్తున్నారు.