ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ప‌ని చేస్తాయా? మూడో డోస్ అవ‌స‌ర‌మా? వైరాల‌జిస్ట్ వివ‌ర‌ణ‌.. 

ఒమిక్రాన్‌. ఆఫ్రిక‌న్ కంట్రీస్‌తో పాటు ఇండియాను భ‌య‌పెడుతున్న‌ వైర‌స్ వేరియంట్‌. కొత్త వేరియంట్ అంటేనే ప‌వ‌ర్‌ఫుల్‌. మ్యూటేష‌న్ జ‌రిగిందంటేనే.. మ‌రింత డేంజ‌ర‌స్‌. వేగంగా విస్త‌రిస్తోందంటే.. ముప్పు పొంచి ఉన్న‌ట్టే. మ‌రి, ఒమిక్రాన్ వ‌ర్రీని ప్ర‌స్తుత‌మున్న వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోగ‌ల‌వా? ప్రాణాపాయాన్ని తగ్గించ‌గ‌ల‌వా? బూస్ట‌ర్ డోస్ అవ‌స‌రం ఉంటుందా? త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఒమిక్రాన్‌ కానీ, మరేదైనా కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదని భరోసా ఇచ్చారు. అయితే, మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంతకీ ఆయ‌న ఏమ‌న్నారంటే....

‘‘భారతదేశంలో కొవిడ్‌ రెండో దశలో డెల్టా వేరియంట్‌ చాలా ఎక్కువ మందికి సోకింది. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు జాతీయ సీరో సర్వే సూచించింది. దాదాపు 94 కోట్ల మంది భారతీయుల్లో యాంటీబాడీలు ఏర్పడ్డాయి. అయితే, దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ స్థాయి ప్ర‌జ‌ల్లో యాంటీబాడీలు ఉన్నాయంటే వారికి కొవిడ్ వ‌చ్చిపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని అని జమీల్‌ వివరించారు. ఇదే భారతీయులకు ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లను తట్టుకునే శక్తిని అందిస్తోందన్నారు. సో.. ఒమిక్రాన్‌ కానీ, మరే ఇతర వేరియంట్‌ కానీ తీవ్ర రోగ లక్షణాలు కలిగించలేవని జమీల్ అంటున్నారు. 

ఒమిక్రాన్‌ రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అని ప్రపంచం ఆందోళన చెందుతోంది. దీనిపై పూర్తి సమాచారం రావడానికి ఇంకా ఒకటీ రెండు వారాలు పట్టవచ్చని జమీల్‌ చెప్పారు. ఒమిక్రాన్‌పై టీకాల సామర్థ్యం కొంత తగ్గినా, అవి పూర్తిగా పనిచేయకుండా పోయే ప్రసక్తి లేదని అన్నారు. వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

కొవిడ్ ముప్పు ముగిసిందా? ఎండెమిక్‌లా మారిపోనుందా? ఒమిక్రాన్ అదేనా?

‘‘ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులకు మధ్య వ్యవధిని ఇప్పుడున్న 16 వారాల నుంచి 12 వారాలకు తగ్గించాలి. ముఖ్యంగా పెద్ద వయసువారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వైద్యులు, సహాయక సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలి’’ అని జ‌మీల్ తెలిపారు.

వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసుల వల్ల ప్రయోజనం ఉన్నా, అత్యధిక భారతీయులకు వేగంగా రెండు డోసులు వేయడం అంతకన్నా ముఖ్యమని జమీల్ చెప్పారు. భారత్‌లో అందుబాటులో ఉన్న టీకాల్లో 90 శాతం కొవిషీల్డేననీ, దాన్ని బూస్టర్‌ డోసుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం పరిమితమేనని అన్నారు. బూస్టర్‌ డోసుగా ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, ప్రోటీన్‌ వ్యాక్సిన్లను ఇవ్వడం మంచిదని ప్ర‌ముఖ వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ షాహిద్ జ‌మీల్ సూచించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu