మొదటి సారి యోగా మొదలుపెట్టేవారికి సులువైన ఆసనాలు!

యోగా ఒక ప్రాచీన భారతీయ సంప్రదాయం, ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. కానీ ఎవరైనా యోగాను కొత్తగా ప్రారంభించినప్పుడు, ఏ యోగాసనాలతో ప్రారంభించాలి, సరైన అభ్యాస పద్ధతి ఏమిటి అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా అయినా సరే.. మెల్లిగా సులభతరం నుండి క్లిష్టమైన దిశగా వెళ్లాలి. అప్పుడే నేర్చుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా శరీరం యోగాకు బాగా అలవాటు పడుతుంది. మొదట్లోనే కష్టమైన యోగా ఆసనాలు ప్రారంభిస్తే అది శరీరం మీద చాలా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. శరీరం ఇబ్బంది పడకుండా యోగాసనాలు నేర్చుకోవడానికి, ప్రారంభంలో సులువైన యోగాసనాలు సాధన చేయాలి. ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుంటే..
తాడాసనం..
తాడాసనం వేయడానికి, పాదాలు కలిపి నిటారుగా నిలబడాలి. చేతులను పక్కన ఉంచాలి. ఛాతీని పైకి ఎత్తి, శరీరం మొత్తాన్ని సాగదీయాలి. తర్వాత మెడను నిటారుగా చాచి, గడ్డాన్ని నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ భంగిమలో 30 సెకన్ల నుండి 1 నిమిషం పాటు ఉండాలి.
వజ్రాసనం..
వ్రజాసనం వేయడానికి మోకాళ్లపై కూర్చోవాలి. తుంటిని మడమలపై ఆనించి, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ, శ్వాసపై దృష్టి పెట్టండి.
భుజంగాసనం..
భుజంగాసనం వేయడానికి పొట్ట మీద పడుకోవాలి. అరచేతులను భుజాల కింద ఉంచి, శరీర బరువును చేతులకి మార్చాలి. ఇప్పుడు, శ్వాస తీసుకుంటూ ఛాతీని పైకి ఎత్తాలి. ఆ ఆసనంలో 30 సెకెన్ల పాటు లేదా 1 నుండి 10 నెంబర్లు లెక్క పెట్టేంత వరకు ఉండాలి.
బాలాసనం..
బాలాసనం వేయడం చాలా సులవు. ఈ ఆసనం వేయడానికి మోకాళ్లపై కూర్చోవాలి. నుదుటిని నేలపై ఆనించి, చేతులను ముందుకు లేదా ప్రక్కలకు చాచాలి. శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి. 30 సెకెన్ల పాటు ఈ ఆసనంలో ఉండాలి.
*రూపశ్రీ.




