కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా ఫాలో అయితేనే పొట్ట కొవ్వు తగ్గుతుంది!
.webp)
ఎక్కువ సేపు కూర్చోవడం, వేయించిన ఆహారం ఎక్కువగా తినడం పొట్టకొవ్వు సమస్య వస్తుంది. నేటి కాలంలో పొట్ట కొవ్వు సమస్య చాలా సాధారణ సమస్యగా మారింది. ఆడవారికి అయినా, మగవారికి అయినా, కనీసం ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పొట్ట కొవ్వు సమస్య తగ్గించుకోవడం కోసం, ఫ్లాట్ గా ఉన్న పొట్ట కోసం చాలామంది జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తారు, కానీ పొట్టకొవ్వు కరగడానికి కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు. పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. పొట్ట కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడే కొన్ని చిన్న మార్పులు, అలవాట్ల గురించి తెలుసుకుంటే..
ఆహారం..
సమతుల్యమైన , తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి, ముందుగా ఆహారంపై దృష్టి పెట్టాలి. వేయించిన , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఓట్స్, పెరుగు, గుడ్లు లేదా సలాడ్ వంటి తేలికపాటి, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంతో రోజును ప్రారంభించాలి. కొద్దికొద్దిగా భోజనం చేయడం వల్ల జీవక్రియ సక్రమంగా జరిగి, కడుపు భారంగా అనిపించదు.
స్వీట్స్, రిఫైండ్ పండి పదార్థాలు..
చక్కెర , శుద్ధి చేసిన పిండిపదార్థాలను తగ్గించాలి. స్వీట్లు, జంక్ ఫుడ్, బ్రెడ్, కేకులు, కుకీలు, శీతల పానీయాలు వంటి శుద్ధి చేసిన పిండిపదార్థాలు పొట్ట కొవ్వు పెరగడానికి కారణం అవుతాయి. వీటిని పరిమితం చేసి, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్‌మీల్, తాజా పండ్లు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
ప్రోటీన్..
ప్రోటీన్‌పై దృష్టి పెట్టాలి. ప్రోటీన్ కండరాలను కాపాడుకోవడానికి , ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆహారంలో గుడ్లు, పప్పులు, పన్నీర్, చికెన్ లేదా జున్నును చేర్చుకోవాలి. ఇది పొట్ట కొవ్వును తగ్గించడమే కాకుండా , ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
నీరు..
శరీరంలో నీటి శాతం పెరగడం జీవక్రియను మెరుగుపరుస్తుంది , ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి, రోజంతా 2-3 లీటర్ల నీటిని త్రాగాలి. భోజనానికి 20-30 నిమిషాల ముందు నీరు త్రాగడం కూడా సహాయపడుతుంది.
ఫైబర్..
ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, ఓట్స్ , తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.
నిద్ర..
నిద్రలేమి పొట్ట చుట్టూ కొవ్వును పెంచుతుంది. నిద్ర సరిపోనప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, బరువు పెరగడానికి దారితీస్తాయి. ప్రతిరోజూ 7-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం.
ఒత్తిడి..
అధిక ఒత్తిడి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి దోహదపడుతుంది. ధ్యానం, దీర్ఘ శ్వాస, లేదా పచ్చని ప్రదేశాలలో సమయం గడపడం వంటివి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు.
శారీరక శ్రమ..
క్రంచెస్ లేదా కార్డియో చేయలేకపోయినా, లైట్ గా శారీరక శ్రమ చేయడం పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు 20-30 నిమిషాలు చురుకుగా నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేసుకోవడం లేదా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం కూడా కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
*రూపశ్రీ.




