Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 4

"కావాలంటే నా మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపొండి. మీ జీపు తర్వాత రిపేరు చేయించి పంపుతాను" అన్నాడు కాంట్రాక్టరు.
"నేను అంతదూరం నడపలేనయ్యా" అన్నారు కుటుంబరావుగారు.
"పోనీ నేనుండిపోతాలే! నువ్వు డ్రైవర్ తో కలిసి వెళ్ళిపోమ్మా!" అన్నారు అయిష్టంగానే.
"అమ్మో! నేవెళ్ళను" అంది లావణ్య.
డ్రైవర్ చిన్నబుచ్చుకున్నాడు.
ఇంకపోతే కుటుంబరావుగారూ, డ్రైవర్ కలిసి సిటికి వెళ్ళాలి - లావణ్యని అడవిలో వదిలేసి.
పులి, ఆవూ, మేకా, గడ్డిమోపు పడవా- ఆ చిక్కు ప్రశ్నలా తయారయింది పరిస్థితి.
ఆ టైం లో అపద్భంధవుడిలా ఉడిపడ్డాడు శ్రీహర్ష. పుష్పక విమానంలా కనబడింది అతని జీపు.
"శ్రీహర్ష! శ్రీహర్ష! అన్నాడు కాంట్రాక్టరు హర్షాతీరేకంతో.
'సార్ధక నామధేయుడు! కనపడంగానే అందరికి హర్షం కలిగించాడు' అనుకుంది లావణ్య.
తాపీగా జీపులోంచి దిగాడు శ్రీహర్ష. కాంట్రాక్టరుని ప్రశ్నార్ధకంగా, కుటుంబరావుగారిని పలకరిపుగా, లావణ్యని మెప్పుకోలుగా , డ్రైవర్ ని జాలిగా చూశాడు.
"అయ్యగారి జీపు చెడిపోయింది" అన్నాడు కాంట్రాక్టరు ఒక్క వాక్యంలో కధంతా చెప్పేస్తూ.
"చూశారా! రోజు బాగా ఉండే జీపు ఒక్కరోజు చెడిపోతే దేనికేం రోగం అనుకుంటారు. ఎప్పుడూ రిపేరు ఉండే నా జీపు ఒక్కరోజు పరిగెత్తినా ఆహాహా అని మెచ్చుకుంటారు- అది ప్రపంచం. ఇంతకీ మీరు......?"
"నేను కుటుంబరావు. జూబ్లిహిల్సు లో బంగాళా ఒకటి కట్టిస్తున్నాను. మంచి కలప డైరెక్టుగా ఇక్కడే కొనేసి సైజింగ్ చేయించి తీసికెళితే బావుంటుందని ఉద్దేశ్యం. ఇది మా అమ్మాయి లావణ్య. ఎమ్మే చేస్తోంది."
"మీరు...?"
ఒక్క క్షణం పాటు అద్బుతమైన నాట్య భంగిమలా కదిలి నమస్కరిస్తున్న చేతుల్ని తదేకంగా చూశాడు శ్రీహర్ష.
"నా పేరు శ్రీహర్ష. శాంతి ఎంటర్ ప్రైజెస్" అనే ఏజెన్సీ నడుపుతున్నాను. ఏ పని అప్పజెప్పినా చేస్తుంది మా ఏజన్సీ. ప్లేన్ టిక్కెట్స్ కొనాలన్నా, రైల్వే రిజర్వేషన్లు చేయించాలన్నా, ఇళ్ళు అమ్మాలన్నా, కొనాలన్నా, సరుకు సప్లై చేయాలన్నా, అమ్మి పెట్టాలన్నా, వాగన్లు అరేంజ్ చెయ్యాలన్నా- ఒక్కమాటలో చెప్పాలంటే, మీరేం చెప్పినా, మీకేం కావాల్సి వచ్చినా, అది క్షణాల్లో చెయ్యబడుతుంది. కస్టమర్స్ కి శ్రమ తగ్గి వాళ్ళకి శాంతి- వాళ్ళిచ్చే డబ్బు వల్ల మాకు శాంతి. అందుకే శాంతి ఎంటర్ ప్రైజర్స్ అని పెట్టాను పేరు."
అయితే మమ్మల్ని తక్షణం హైదరాబాద్ చేర్చండి" అంది లావణ్య చిరునవ్వు పెదాల కింద తొక్కిపట్టి.
శ్రీహర్ష జీపుకి జేరగిలబడి నిల్చున్నాడు. "వైనాట్? అందుకే శ్రీహర్ష ఉన్నాడు. అయితే ఫీజు మాత్రం దారుణంగా వసూలు చేస్తాను సుమండీ! ఎంతవుతుందో మీరు ఉహించలేరు."
"మా నాన్నగారు ఎంత ఇవ్వగలరో మీరూ ఉహించలేరు" అంది లావణ్య కాస్త గర్వంగా కుటుంబరావుగారి వైపు చూస్తూ.
జేబులోంచి సిగరెట్ తియ్యబోయి, కుటుంబరావుగార్ని చూసి మానేశాడు శ్రీహర్ష.
"ఫర్వాలేదు కాల్చు" అన్నారు కుటుంబరావుగారు.
నవ్వుతూ తల అడ్డంగా తిప్పి లావణ్య వైపు తిరిగాడు.
"మంచి కస్టమర్ల దగ్గర అరువు పెడతాను- మళ్ళీ ఇంకోసారి వాళ్ళు నా దగ్గరికి రావాలని. అలాగే మీకు క్రెడిట్ అకౌంట్. డబ్బులు తీసుకొను సార్! మీలాంటి పెద్దవాళ్ళ పరిచయం కావాలి. మీరు నా పేరు నలుగురికి రికమెండ్ చెయ్యాలి" అన్నాడు మళ్ళీ కుటుంబరావు గారి వైపు చూస్తూ.
అతను సరదాగా అనేసినా, ఆ మాటల్లో చొరవా, హాస్యంగానే కలిపినా బిజినస్, చూపిస్తున్న గౌరవం, అన్నీ గమనించారు కుటుంబరావు గారు.
అతను రెండు సెకండ్లకో సారి తనవైపు చూస్తూ, అంతలోనే చూపులు తిప్పెసుకుంటే  మళ్ళీ అంతలోనే చూస్తూ ఇబ్బంది పడిపోవడం గమనిస్తోంది లావణ్య.
తనకి ఆటగా, సరదాగా ఉంది.
కొంతమంది ఆడపిల్ల కనబడితే చాలు, గుడ్లప్పగించి, మింగేసేలా చూస్తుంటారు.
అలాంటి వాళ్ళను చూస్తే వళ్ళు మండిపోతుంది. ఇతనలా కాదు, చూడ్డం సభ్యత కాదని తెలుసు. తెలిసి చూడకుండా ఉండలేకపోతున్నాడు.
హద్దు మిరకుండా , చూపుల్తోనే 'నువ్వు బాగున్నావు' అని చెబితే ఏ ఆడపిల్లకు ఇష్టం కాదు?
మొగవాళ్ళు అమ్మాయిల్ని పట్టిపట్టి చూడటానికి సంకోచిస్తారు ఏమనుకుంటారో, ఏమంటారో అని.
కానీ అమ్మాయి అబ్బాయి వైపు చూడదలుచుకుంటే నిరభ్యంతరంగా చుసేయ్యొచ్చు. కారణం- అతను సంతోషిస్తాడే కాని బాధపడడు కాబట్టి.
ఆపాదమస్తకం అతన్ని పరికించి చూసింది లావణ్య.
తనకంటే ఇంకో ఆయిదారంగుళాలు పొడుగుంటాడు. దువ్వెనకు లొంగని బిరుసు జుట్టు, ఉంగరాలు ఉంగరాలుగా మొహం మీద పడుతోంది. సూటిగా ఉన్న ముక్కూ, సిగరెట్లు కాల్చి కాల్చి కాస్త నల్లబడ్డ పెదాలు, వెడల్పైన భుజాలు, సన్నటి నడుమూ- 'V' ఆకారంలో కనబడుతున్నాయి. తెల్లషర్టు, నీలం రంగు ప్యాంటూ వేసుకుని ఉన్నాడు. షర్టుపై గుండెల మీదంతా వెంట్రుకలు. ఆ రోజు గెడ్డం చేసుకోనట్లుంది. చెంపల మిదంతా దట్టంగా పెరగటానికి తయారుగా ఉన్న గెడ్డం. తెల్లటి అతని మొహం మీద ఆ గెడ్డం నలుపు కలిసి ఆకుపచ్చగా కనబడుతోంది. గెడ్డం మీద ఎవరో కత్తితో గట్టిగా నొక్కినట్లు గుంటపడింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS