Previous Page Next Page 
భామ కలాపం పేజి 4

 

    అదంతా చూసి చులకనగా నవ్వుకుంది సుదీర. ఒకవైపు ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతున్నా ఈ ఇంటి మనుషులు ఇంకా ఇరవయ్యో శతాబ్దంలోకి అడుగన్నా పెట్టినట్లు లేదు. చాలా సనాతనంగా కనబడుతోంది ఈ ఇంటి వాతావరణం.


    అసలు ఈ నాయకుల ఫోటోలు ఇన్నెందుకు? మమ్మీ ఆఫీసు రూమ్ లో కూడా రాజకీయవేత్తల బ్లో అప్ ఫోటోలు స్టీలు ఫ్రేముల్లో బిగించి ఉంటాయి. ఒకటో- రెండో- ఎవరు దశలో ఉంటె వాళ్ళవి! అంతేగానీ, మరి ఇంత వెర్రిగా మాత్రం కాదు.


    "నిలబడే ఉన్నారే, కూర్చోండి!" అంది భరత్ చెల్లెలు, నగిషి చెక్కి ఉన్న పాతకాలపు కుర్చీని చూపిస్తూ.

    "థాంక్స్!" అని కూర్చుంటూ, "వాట్స్ యువర్ నేమ్!" అని అడిగింది సుదీర.


    "స్వతంత్ర భారతి!"

 

    "వాట్?"

 

    "స్వతంత్ర భారతి!"

 

    "యూ ఆర్ జొకింగ్!" అంది సుదీర అపనమ్మకంగా. స్వతంత్ర భారతి అన్న పేరు పెట్టుకుంటారా ఎవరైనా అసలు?


    "అవునమ్మా! స్వతంత్ర భారతి అనే పేరు పెట్టాను అమ్మాయికి. స్వతంత్రం కోసం కలవరించి పోయేవాళ్ళం ఆ రోజుల్లో. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే పెళ్ళి చేసుకున్నానమ్మా! ఆ తరవాత పదిహేనేళ్ళకు పుట్టాడు అబ్బాయి. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టుంది అమ్మాయి. వాళ్లకు విజయ్ భరత్, స్వతంత్ర భారతి అని పేరు పెట్టి నా మువ్చట తిర్చుకున్నాను" అన్నారు సదాశివరావుగారు పూజగదిలో నుంచి బయటికి వస్తూ.


    అయన కుడిచెయ్యి పడిపోయి ఉంది. కుడికాలు కొంచెం ఈడుస్తూ నడుస్తున్నారు. బ్రిటిష్ వారు జైల్లో పెట్టి గోళ్ళలో గుండు సూదులు గుచ్చి, బట్టలు విప్పి నగ్నంగా మంచు దిమ్మల మీద పడుకోబెట్టి , చిత్ర హింసలు పెట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బ తిని శాశ్వతంగా దుర్భాలుడై పోయారు అయన. కానీ, అయన మొహం మాత్రం ప్రశాంతంగా ఉంది. పెదిమల మీద చిరునవ్వు మెదులుతోంది. వయసు మీద పడినా కూడా చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉండి, కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయన కూడా అలాంటి మనిషే. ముతక ఖద్దరు పంచె లాల్చి.


    "ఏమిటి చూస్తున్నావ్? ఆ ఫోటోలా! అలాంటివి ఇంకా ఆల్బం నిండా ఉన్నాయమ్మా! అదిగో, ఆ ముగ్గురూ ఎవరో తెలుసా? లాల్, బాల్, పాల్ అని మురిపెంగా పిలుచుకునే వాళ్ళం- లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్............'


    అయన చెబుతూనే ఉన్నారు. లోపల లయబద్దంగా వినబడుతున్న అడుగుల చప్పుడు ఆగిపోయింది. ఒక పిల్లాడి గొంతు వినబడుతోంది- "మీరు ఫీజు ఎంత తీసుకుంటారో కనుక్కొమ్మని అమ్మ చెప్పింది సార్!"

    భరత్ నవ్వాడు. "ఫీజు లెదూ, ఏమి లెదూ. ఈ డాన్సు అన్నయ్య, పాటల అక్కయ్య అందరికి ఫ్రీగా నేర్పిస్తారని అమ్మకి చెప్పు. అంతేకాదు. బుద్దిగా, శ్రద్దగా నేర్చుకుంటే బిస్కెట్లు, చాక్లెట్లు కూడా ఇస్తాడని చెప్పు. సరేనా? చెల్లెలు రాలేదేం ఇవాళ?"


    "జ్వరం అన్నయ్యా! రేపటి నుంచి మళ్ళీ వస్తుంది.


    పిల్లలందరూ బిలబిల్లాడుతూ బయటకు వచ్చారు. ఆ వెనకేనే టవల్ తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు భరత్. కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్లింది భారతి.

 

    హాండ్ బాగ్ లో నుంచి సరికొత్త అయిదు రూపాయల నోట్ల కట్ట తీసింది సుదీర. "రాత్రి జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. మీకు ఇవ్వవలసిన మూడు వందలకి బదులు అయిదు వందలు ఇస్తున్నాము- తీసుకోండి" అంది ఇంగ్లీషులో.


    భరత్ ఆ డబ్బు అందుకునే ప్రయత్నం చెయ్యలేదు. "మీరు......?" అన్నాడు నిశితంగా చూస్తూ.


    "నేను రత్నాకరరావు గారి డాటర్ని.'


    ఆమె ఉహించినట్లు అతని మోహంలో కోపం కనబడలేదు. 'నేను నిన్న ప్రోగ్రాం సగంలో వదిలేసి వచ్చాను. మీరు నాకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు" అన్నాడు చాలా మాములుగా.


    భారతి పెద్ద స్టీలు గ్లాసు తెచ్చి, "కాఫీ తీసుకోండి!" అంటూ అందించింది.


    కాఫీ గ్లాసు చేతిలో పట్టుకుని చుట్టూరా చూసింది సుదీర. రెక్కలు లేని రామ చిలక ఒకటి తలుపు తెరచి వున్న పంజరంలో నుంచి కిందికి గెంతి, నడుస్తూ భరత్ వైపు వెళ్ళింది.


    కొయ్య షెల్ఫులో నుంచి రెండు చాక్లెట్లు, కొన్ని గింజలు తీసి చిలకకి పెట్టాడు భరత్.

 

    "మా అన్నయ్య పంచప్రాణాలు ఆ చిలకలోనే ఉన్నాయి. అతి గారాభం చేస్తాడు దాన్ని. తను అడిగింది ఇవ్వకపోతే కాకిగోల చేస్తుంది ఈ చిలక!" అంది భారతి నవ్వుతూ. "అసలు ఇది మా అన్నయ్యకి ఎలా దొరికిందో తెలుసా అండి?"


    "భారతీ!" అన్నాడు భరత్ వారిస్తూ.


    వినిపించుకోకుండా చెప్పింది భారతి- "ఒకసారి మా అన్నయ్య ఎక్కడో ప్రోగ్రాం ఇచ్చి జేబులో రెండు వందల రూపాయలతో తిరిగి వస్తున్నాడు. దారిలో చిలక ప్రశ్న చెప్పేవాడు ఒకతను ఆపాడు అన్నయ్యని. అతని పక్కనే ఇరుకు పంజరంలో తోకా, రెక్కలు కత్తిరించేసి ఉన్న చిలక చికాకుగా తిరుగుతోంది. దాని అవస్థ చూసి గుండె కరిగిపోయి దగ్గర కెళ్ళాడు అన్నయ్య. చిలక అలవాటుగా ముక్కుతో ఒక చీటీ తీసింది. 'అద్భుతమైన లావణ్యం, అపారమైన ఐశ్వర్యం కళ అమ్మాయి నిన్ను మోహించి పెళ్ళి చేసుకుంటుంది' అని ఉంది దానిలో. మా అన్నయ్య అది నమ్మకుండా నవ్వుకుని జేబులో వున్న రెండొందలు రూపాయలు ఆ చిలక ప్రశ్నవాడికి ఇచ్చేసి, దాన్ని మా ఇంటికి తీసుకొచ్చి పెంచడం మొదలెట్టాడు."


    హేళనగా మనసులోనే నవ్వుకుంది సుదీర. ఎవరో అద్భుతమైన లావణ్యం, అపారమైన ఐశ్వర్యం కల అమ్మాయి ఇతన్ని మోహించి పెళ్ళి చేసుకుంటుందట. పాపం.......ఇంతకంటే గొప్ప మగాడు దొరకడని!


    "మీ చిలకకి మరి అతి చనువు ఇస్తున్నట్లున్నారే! మనం పెంచుకునే పెట్స్ ని డిసిప్లిన్ లో పెట్టాలి" అంది సుదీర.


    ఆమె దగ్గర పెంపుడు కుక్కలు ఏడు వున్నాయి. వాటిని మిలటిరి డిసిప్లెన్ లో ఉంచుతుంది తను. ఆమె ముందు అవి ఇష్టం వచ్చినట్లు తోకాడించడానికి కూడా వీల్లేదు.


    సంతోషంగా అరుస్తూ చాక్లెట్ ని ముక్కుతో పొడిచి తింటోంది చిలక.

 

    "సుదీరా ఊరికే వాగకు - తలనొప్పి!" అన్నాడు భరత్.


    ఉలిక్కిపడి , భరత్ వైపు తీవ్రంగా చూసింది సుదీర. "వాడ్యూ మీన్? నన్ను వాగకు , గీగకు అని అంటారా? హో డేర్ యూ!" అంది ఆగ్రహంగా.

 

    తెల్లబోయాడు భరత్. "నేను మిమ్మల్నేందుకు అంటాను? సుదీరని కోప్పడుతున్నాను."


    "మళ్ళీ అదే! సుదీర ఎవరు.........నేను కాక?"


    భరత్, స్వతంత్ర భారతి ఒకళ్ళని ఒకళ్ళు నవ్వు మొహంతో చూసుకున్నారు. "మా చిలక పేరు కూడా సుదీరే!" అంది భారతి.


    "దీని పేరు సుదీరా? ఎవర్నడిగి పెట్టారు ఆ పేరు?" అంది సుదీర వళ్ళు తెలియని కోపంతో.


    "సారీ! మీ పేరు కాపీ రైట్ ని నాకు తెలియదు" అన్నాడు భరత్.

 

    "ముందు కాఫీ తాగండి. కోపం తగ్గుతుంది." అంది భారతి నవ్వుతూ.

 

    "సుదీర కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. "మీరు తాగారా?"


    "మేం తెల్లవారుజామునే లేచి కాఫీలు తాగేస్తాం. ఆ తర్వాత మళ్ళీ భోజనమే. మధ్యలో ఇంకేమి తీసుకోము. అయితే ఈ అంక్షలన్ని మా అతిధుల నెత్తిన రుద్దేయ్యంలెండి.' అంది భారతి.


    ఆ ఇంట్లోని మనుషుల ప్రవర్తన తమాషాగా కనబడింది సుదీరకి. ఎదురి వ్యక్తితో కొత్తా పాతా లేకుండా కలిసిపోతూ........సరదాగా మాట్లాడుతూ నిష్కల్మషంగా ఉన్నారు వీళ్ళు.


    చిలక- సోల్జరు మార్చి చేస్తున్నట్లు కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి, తర్వాత గుమ్మం దాటి బయటికి వెళ్ళింది.


    గుమ్మం దగ్గర ఎవరో చెప్పులు వదులుతున్న చప్పుడు.


    భారతి చూసి, "సుమిత్ర అత్తయ్య!" అంది సంతోషంగా.


    వస్తూనే చేతిలోని పుస్తకాలు హాండ్ బాగ్ చాపమీద పెట్టి కూర్చుంటూ "భారతి! నీకు మార్కులు ఎంత  పర్సెంట్ వచ్చాయే?" అంది సుమిత్ర.


    చెప్పింది భారతి.


    వెంటనే సుమిత్ర మొహం వికసించింది. "మరింకేం! నీకు మంచి కోర్సులో సీటు ఇప్పిస్తాను. మా స్టాఫ్ కి కూడా కోటా ఉందిట. ఇందాక సుందర్రావుగారు చెప్పేదాకా నాకూ తెలియనే తెలియదు. తెలియగానే వెంటనే ఇటూ వచ్చేశాను."

    "నిజంగానా?" అంది భారతి పట్టశక్యం కానీ సంతోషంతో.


    మళ్ళీ వివరంగా చెప్పింది సుమిత్ర. తర్వాత, అప్పుడే గమనించినట్లు సుదీర వైపు అనుమానంగా చూసి, "ఇలా రా!" అని భారతిని లోపలికి తీసుకెళ్ళింది. లోపల నుంచి గుసగుసగా మాటలు.


    "అలా అయితే వద్దత్తయ్యా!" అంటోంది భారతి గట్టిగా.


    "నీ మొహం . ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో.!" అని గదమాయిస్తోంది సుమిత్ర.


    "నాకు ఇష్టం లేదత్తయ్యా!"


    "అసలు నా మాటంటేనే మీకు లక్ష్యం లేదు లేవే! నువ్వూ అంతే, మీ అన్నా అంతే, మీ నాన్నా అంతే!" అంది సుమిత్ర కోపంగా.

 

    ఏమిటమ్మా గొడవ?" అంటూ నెమ్మదిగా నడుస్తూ లోపలికి వెళ్ళారు సదాశివరావుగారు. భరత్ కూడా వెనకనే వెళ్ళాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS