Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 3

 

    కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు సుధీర్.
    
    అదే సమయంలో గేట్లో ప్రవేశించింది ఒక రిక్షా.
    
    సుధీర్ మొహం చిట్లించాడు. "ఎవడో పేషెంటు అయి వుంటాడు. మనం లేమని తెలిస్తే - ఇంకో డాక్టర్ దగ్గరి కెళతాడులే!" అంటూ కారు ముందుకి పోనిచ్చాడు. ఏం చెయ్యాలో తోచక, అలాగే సందిగ్ధంగా చూస్తూ ఉండిపోయింది శశి.
    
    "అమ్మగారూ!" అంటూ రిక్షాలోంచి క్రిందికి దూకాడు శంకర్రావు. అతను శశి దగ్గర కాంపౌండరుగా పని చేస్తున్నాడు. రిక్షాలో ఒక పాతికేళ్ళ అమ్మాయి మొహంలో బాధ సుళ్ళు తిరుగుతూ ఉండగా కూర్చుని ఉంది.
    
    "నా భార్య అమ్మగారూ! తల నొప్పిట ! గంటసేపటినుంచీ గిలగిల్లాడి పోతూంది. ఎంతకీ తగ్గకపోయేసరికి ఇలా తీసుకొచ్చేశాను" అన్నాడు శంకర్రావు కంగారుగా, కారు కిటికీలో తల పెట్టి, పరుగులాంటి నడకతో కారు పక్కనే వస్తూ.
    
    "కారాపండి ప్లీజ్!" అంది శశి, సుధీర్ తో.
    
    సుధీర్ వాచీ చూసుకుని, "టైమయిపోతూంది." అన్నాడు విసుగ్గా.
    
    "ఒక్క నిమిషం!" అంటూ కార్లోనుంచి దిగి, రిక్షా దగ్గరికి నడిచింది శశి. త్వరత్వరగా నడుస్తున్నా, ఆమె నడకలో తొట్రుపాటు లేదు. అద్భుతమైన లయ విన్యాసం ఉంది.
    
    "నీ భార్యా? నటే శారద కదూ?" అంది శశి. శారద చెయ్యి అందుకుని నాడి చూస్తూ.
    
    తనలాంటి 'అల్పుడి' భార్య పేరు ఆమెకి గుర్తున్నందుకు పొంగిపోయాడు శంకర్రావు.
    
    "అవునమ్మగారూ! శారదేనండీ!"
    
    శారద బాధను వోర్చుకుంటూ, వినయంగా నవ్వింది.

    ఈ లోపల నర్సు ప్రమీల గబగబ వెళ్లి స్టెత్ తెచ్చింది. దానితో పరీక్ష చేసింది శశి.
    
    'ఏమీ లేదు ఎక్జర్షన్- అలసటా, నీరసమూను! కొద్దిగా రెస్టు ఉంటే చాలు! నర్సింగ్ హోమ్ లో ఉండిపొమ్మను, ఈ మూడురోజులూ! నేను రాగానే కంప్లీట్ చెకప్ చేస్తాను" అని శారదవైపు తిరిగి నవ్వుతూ "ఏమ్మా! నీకు మూడు రోజులు పాటు సెలవు. మీ ఆయన వంట చేసి తెస్తుంటారు. నువ్వు హాయిగా తినేసి, పత్రికలు చదువుకుంటూ పడుకో!" అంది.
    
    శారద కొద్దిగా బిడియంతో తల వంచుకుంది. ఆ బిడియం ఆమెకు ఎంతో అందాన్నిచ్చింది. సిసలైన తెలుగు ఆడపడుచులా ఉంది శారద. మర్యాదా, మన్ననా, సిగ్గూ, బిడియం, మొహమాటం, ఆమె మోహంలో కనబడుతున్నాయి.
    
    ఏమేమి మందులివ్వాలో నర్సుతో చెప్పింది శశి. తర్వాత సుధీర్ వైపు తిరిగి, గొంతు తగ్గించి డయాగ్నోసిస్ ఏమిటో చెప్పి, "ఏవన్నా కాంప్లికేషన్ వస్తే.." అనబోయింది ఇంగ్లీషులో.
    
    "...డాక్టర్ వీరభద్రరావుకి ఫోన్ చెయ్యాలి - అంతేనా" అన్నాడు సుధీర్ చిరాగ్గా.
    
    శశి నవ్వింది. అందరికి 'బై' చెప్పింది. కారు కదిలింది.
    
    ఒక అరగంట తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయి, శారద నర్సింగ్ హోమ్ లో, మెత్తటి ఫోం బెడ్ మీద భయం భయంగా పడుకునే సమయానికి, శశి విమానంలో సౌఖ్యంగా ఉన్న సీటులో కొద్దిగా వెనక్కి జేరగిలబడి కళ్ళు మూసుకుంది.
    
                                                                     * * *
    
    మర్నాడు గడిచింది. ఆ తర్వాత రోజు...
    
    ఎయిర్ కండిషన్డ్ రూం.
    
    అందులో అందమైన ఆడపిల్లలు జలకాలాడే సరస్సంత పెద్దదిగా ఉన్న మంచం.
    
    దానిమీద ఒంటరిగా పడుకుని ఉన్నాడు సుధీర్. ఒక చేతిలో సిగరెట్ వుంది. రెండో చేతిలో ఇర్వింగ్ వాలెస్ "ఫాన్ క్లబ్" నవల వుంది. ఒక సినిమాతారని నలుగురు ఎత్తుకెళ్ళిపోతారు ఎత్తుకెళ్ళి.....రహస్యంగా ఒక ఇంట్లోఉంచి.....అడ్డూ అదుపూ లేని భాషలో రాసివుంది ఆ సన్నివేశం!
    
    తీక్షణంగా చదువుతున్నాడు సుధీర్. అంత ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు పై  పెదవిని పంటితో కొరికి పట్టుకోవడం అతనికి అలవాటు.
    
    ఎంత తేలిగ్గా రాసేస్తారీ రచయితలు - రేప్, మానభంగం అంటూ!
    
    అలా చెయ్యడం ఎంత ప్రమాదం! ఎంత గుండెధైర్యం కావాలి! ఎంత నిబ్బరం ఉండాలి! అసలెలా సాధ్యం! ఆడది 'అమ్మా' అని కేకేసిందంటే పదిమంది పోగయిపోతారు! వాణ్ణి నరికి పోగులు పెడతారు.
    
    కానీ ఎంత ఎగ్జయిట్ మెంట్!
    
    సుధీర్ ఒళ్ళు గగుర్పొడిచింది.
    
    తనకీ పర్వర్టెడ్ స్ట్రీక్ ఎందుకు పెట్టాడు దేవుడు?
    
    అసలు తనలోనే కాదు, ప్రతి మనిషిలోనూ ఉంటుందేమో ఆ రాక్షసత్వపు ఛాయ - కొద్దో గొప్పో.
    
    లేకపోతే ఎవరిల్లో తగలబడిపోతుంటే మొహాల్లో కుతూహలం, ఎగ్జయిట్ మెంట్ కనబడిపోతూ పరుగెత్తి కెళ్ళి చూస్తారేం ! ఫ్రీగా సినిమా చూస్తున్నట్లు చూస్తూ, తగలబడిపోతున్నది తమిల్లు కానందుకు సంతోషిస్తూ, ఆ సంతోషంలో ఉదారంగా సానుభూతి చూపిస్తారేం!
    
    హైదరాబాద్ టాంక్ బండ్ లో శవం తేలితే, క్షణాల మీద సైకిళ్ళూ, కార్లూ, ఆటలూ పోగయి పోతాయేం? శవాన్ని చూద్దామనే కుతూహలమా? చచ్చిపోయిన వాళ్ళ మీద జాలా? ఏమిటి? అక్కడ సన్నివేశం ఎలా ఉంటుంది - టకటక సైకిళ్ళ కి స్టాండులు పడిపోతుంటాయి. సైకిలుకి తాళంవేసి తాళం జేబులో భద్రపరచుకుని మనిషిని మనిషి తినే కాన్నిబాలిక్ ఉద్రేకం, ఉత్సాహం మోహంలో ప్రస్ఫుటమవుతుండగా, శవం తాలూకు 'దృశ్యం' చక్కగా కనబడే స్థలం వెదుక్కుని, అప్పుడు మొహంలో జాలి చూపిస్తూ, "అరెరె!" "మొగాయనే!" "బాగా నీళ్ళు త్రాగాడు!" అంటూ రకరకాల కామెంట్లు, సానుభూతి వాక్యాలు!    


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS