Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 3

 

    పొరపాటుకి నాలుక్కర్చుకుని "క్షమించండి" అని మరో సారి అని అలా మరోసారి అన్నందుకు మరోసారి నాలుక్కొరుక్కుని ఈ తఫా "ఇక్కడ మంచినీళ్లుంటాయండి?" అని తల తిక్కడా మాట్లాడక "ఓ గ్లాసెడు నీళ్ళిస్తారా?" అని అడిగాడు మదన్ గోపాల్ భయం భయంగా చూస్తూ.
    
    వైజయంతి కోప్పడలేదు. పెద్దగ్లాసెడు కొత్తకుండలోని అయిస్ వాటర్ తెచ్చియిచ్చింది.
    
    మదన్ గోపాల్ కి మంచినీళ్ళు తాగంగానే పోతున్న ప్రాణం ఆగిపోయింది పోకుండాను. అప్పటికప్పుడే జెమినీ టీ తాగినట్లు వుషారు, బోర్నవీటా తాగిన శక్తి, హార్ లిక్స్ పుచ్చుకున్న బలము వచ్చాయి. ఎవరయినా ఆ నిమిషాన మదన్ గోపాల్ ని "నీవు యింత శక్తి బలము వుషారుతో వుండుటకు తరచు ఏమి పుచ్చుకుందు"నని అడిగితే "ఒక గ్లాసెడు మంచినీరు మాత్రమే" అని చెప్పేవాడే.
    
    "ఇహమీరు వెళితే తలుపేసుకోవాలి" అన్నట్లు చూస్తూ నుంచుంది వైజయంతి.
    
    తొందరపడకపోతే లాభం లేదనుకున్నాడు మదన్ గోపాల్.    

    "అద్దెకు వాటాకావాలి."
    
    "ఇక్కడేం ఖాళీల్లేవు."
    
    టులెట్ బోర్డ్ వైపు వేలుపెట్టి చూపించాడు మదన్ గోపాల్.
    
    .....
    
    గతుక్కుమంది వైజయంతి.
    
    "అది....అది..."
    
    "అది చూసే వచ్చాలేండి."
    
    "మంచిది."
    
    "అదే నేనూ అనుకుంటున్నాను."
    
    వైజయంతికి బోలెడు కోపంవచ్చింది. "ఈ పిల్లగాడు మా చెడ్డవాడు" అనుకుంది చస్తే ఇల్లివ్వకూడదనుకుంది.    

    "నేనేనా ఇలా మాటకి మాట సమాధానం చెప్పింది. ఇదంతా మంచి నీళ్ళ మహత్యం కాదుకదా?" అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు మదన్ గోపాల్.
    
    "మీరెళితేనే తలుపేసుకోవాలి" ముఖంమీదనే తలుపేస్తే బాగుండదని. మదన్ గోపాల్ ముఖంమీదనే మర్యాదగా చెప్పింది వైజయంతి.
    
    "అద్దెవాటా...?"
    
    "మీ కివ్వమండి" ముఖమాటం లేకుండా చెప్పేసింది వైజయంతి.
    
    "నేనేం పాపం చేశానండి?"
    
    "అది మీకే తెలియాలి."
    
    "నాకు తెలిసినంతవరకూ నేనేం పాపం చెయ్యలేదండి."
    
    "మంచిది... మాయిల్లు యివ్వనని చెప్పాగా?"
    
    "ఎందుకని, అని నే అడుగుతున్నాను."
    
    "అది మీకనవసరం అని నే చెపుతున్నాను."
    
    "మీరు...?"
    
    "మీరు..."
    
    వాదులాటలో ఇరువురిగొంతు హెచ్చుస్థాయిలోకి వెళ్ళింది, సరీగ అప్పుడే సౌభాగ్యమ్మ రావటం జరిగింది. ఆవిడ వైజయంతి తల్లి, వస్తూనే___
    
    "ఏంటమ్మా! ఆ దిక్కుమాలిన స్టీలు సామానులవాడు మళ్ళీ వచ్చాడా?" అంది.
    
    కాదమ్మా! ఈయన...ఈయన..."
    
    "నేను దిక్కుమాలిన స్టీలుసామానులవాడినీ కాదు, పనికిమాలిన పాత లాంతర్లు బాగుచేసేవాడినీకాదు" ఖచ్చితంగా చెప్పేశాడు మదన్ గోపాల్.
    
    సౌభాగ్యమ్మ మనిషిని చూడకుండా మాట జారినందుకు బాధపడింది. స్టీలుసామానులవాడిగోల ఆవిడ కెక్కువయింది. "వద్దురాబాబూ." అన్నా వినకుండా ముందుగా "మీ బోణీ మంచిదంటూ" ఏ చెంబో గిన్నో యిచ్చిపోతాడు. ఆ తర్వాత ఇన్ని గుడ్డలు కావాలి, అన్ని గుడ్డలు కావాలి అంటూ పేచీకి దిగుతాడు. వాడేమో అనుకుంది.
    
    "మా అమ్మాయి గట్టిగా మాట్లాడటం విని స్టీలు సామానులవాడేమో అని అనుకున్నాబాబూ!" నొచ్చుకుంటూ అంది సౌభాగ్యమ్మ.
    
    "ఫరవాలేదులెండి. పొరపాటు ఎవరికైనా సహజమే."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS