Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 2

    ఆమె తలవాల్చి "ఔను" అంది.

    అతను నిరాశగా "మీవారి పేరు?" అడిగాడు.

    ఆమె సిగ్గుగా తల వంచుకుని "హిందూ స్త్రీ ఎక్కడైనా భర్త పేరుచెప్తుందా?" అంది.

    బామ్మగారు మెచ్చుకోలుగా చూసింది.

    "మిమ్మల్ని పొందిన అతను చాలా అదృష్టవంతుడు" అన్నాడు ఆ అబ్బాయి నిట్టూరుస్తూ.

    ఆమె మనోహరంగా నవ్వింది.

    "ఆ నవ్వు-ఆ నవ్వు చూస్తూంటే నాకు స్ట్రాంగు బూస్టు తాగినంత ఉత్సాహంగా వుందంటే నమ్మండి."

    ఆ అమ్మాయి మళ్ళీ నవ్వి "మీరు చాలా తమాషాగా మాట్లాడతారే" అంది.

    "నా గర్ల్ ఫ్రెండ్సు కూడా అలాగే అంటారు."

    ఆ మాటకి ఆమె కొద్దిగా కళ్ళు చిట్లించి-"గర్ల్ ఫ్రెండ్సా?" అంది.

    అతను వెంటనే సర్దుకుని "గర్ల్ ఫ్రెండ్స్ కేంలెండి, బోలెడుమంది వున్నారు. లేనిదల్లా ప్రేయసే..." అన్నాడు.

    "అదేం పాపం?" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది ఆమె.

    "వెన్నెల వెలుగులాంటి, జాబిలి జిలుగులాంటి ప్రేయసి కోసం ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి..."

    "ఆ ఇన్నాళ్ళకి?"

    "ఇలా ట్రైనులో అనుకోకుండా పరాయి సొత్తుగా దర్శనమిచ్చింది" ఆమెవైపు దిగులుగా చూస్తూ అన్నాడు.

    "అంటే మీ వుద్దేశ్యం....?" ఆమె మొహం ఎర్రబడి కోపంతో కాదు, అసలా అబబాయి ఎంత అందంగా వున్నాడంటే-అతడు ఏం మాట్లాడినా ఆ అమ్మాయిలు కోపం తెచ్చుకోనంత.

    బామ్మగారు గుండెల మీద చెయ్యి వేసుకుంది. ముసలాయన ముందుకి వంగడంతో ఆయన కళ్ళజోడు ముక్కుమీదకి జారిపోయింది.

    ఆ అబ్బాయి "హూ..." అని నిట్టూర్చి "దేవుడు ఎంత నిర్ధయుడు? ఇంత అందాన్ని ఇంత ఆలస్యంగా నాకు చూపించడం?" అన్నాడు.

    ఆమె మాట్లాడలేదు, కానీ అతని మాటలు ఆమెకు రుచించినట్లే వున్నాయి. బహుశా అతను చాలా స్మార్ట్ గా వుండడం అందుకు కారణమేమో!"

    "నిజం చెప్పండి, మీకూ అలాగే లేదూ!" అతను రెట్టించాడు.

    ఆమె తలవంచుకుని మౌనంగా వుండిపోయింది. అతడు రెట్టించాడు. సమాధానం చెప్పేవరకూ వదిలేలా లేడని అస్పష్టంగా తలూపింది అంతే.

    "హుర్రే" అని అతను అరిచిన అరుపుకి దంపతులిద్దరూ ఉలిక్కిపడ్డారు.

    ముసలాయన గుండె చేత్తో పట్టుకొని దుమదుమలాడుతూ చూశాడు. అతడు ఆమె దగ్గరగా వంగి.

    "మీకూ అలాగే అనిపిస్తోందా?" అని వెంటనే స్వరం తగ్గించి ".....ట్రైను దిగిపోండి! ఇక్కడే హైదరాబాద్ లోనే నాతోనే వుండి పోదురుగాని" అన్నాడు రహస్యంగా.

    బామ్మగారు బుగ్గలు నొక్కుకుని "అవ్వ ఎంతటి విపరీతం" అని భర్తతో.

    "చెప్పండి ప్లీజ్" అంటున్నాడతను. అతని మాటలు ఎవరైనా వింటున్నారేమోనని కంగారుగా అటూ ఇటూ చూసి గుండెలమీద చెయ్యి వేసుకుని "హైద్రాబాద్ లోనా? మా ఆయన ఇక్కడే వుంటారుగా ఎలా?" అంది-తనుకూడా రహస్యంగా.

    "మా ఆవిడ కూడా ఇక్కడే వుంది" విచారంగా చెప్పాడతను. "ఇంతకీ ఎందాకా ప్రయాణం?" తిరిగి అడిగాడతను.

    "విజయవాడ, మా పుట్టింటికి" చెప్పింది ఇంగ్లీషులో.

    అతను ఉషురుగా "అయితే మీ ఎడ్రసు ఇవ్వండి. నేను రేపే విజయవాడ వచ్చేస్తాను అక్కడ నుండి ఓ రెండ్రోజులు మీ స్నేహితురాలి దగ్గరకని చెప్పి గౌహతి వెళ్ళిపోయి హేపీగా వుందాం" అన్నాడు.
    ట్రైన్ బయలుదేరబోతున్నట్టు సూచనగా పెద్ద కూత పెట్టింది.

    ముసలి దంపతులిద్దరూ "అమ్మయ్య" అనుకున్నారు.

    ఆ అమ్మాయి ఆదరాబాదరా తన ఎడ్రసు ఓ కాగితం మీద వ్రాసి ఇచ్చింది.

    "అసలిప్పుడే విజయవాడ వద్దను, కానీ అర్జంటు పని ఒకటి వచ్చిపడింది ఈవేళ" అన్నాడు. హిందీలో ముసలి వాళ్ళకి అర్ధం కాకుండా.

    అసలాయన భార్యతోటి "ఆ అమ్మాయి ఇంకాస్త బతిమాలితే వీడు ఇప్పుడే వచ్చేసేటట్టు వున్నాడు" అన్నాడు. "పైగా మనకర్ధం కాకూడదని హిందీలో మాట్లాడుతున్నాడు."

    "వూ...మరే!" అంది బామ్మగారు కోపంగా.

    "రేపు నిజంగా వస్తారు కదూ!" ఆ అమ్మాయి సంశయంగా అడిగింది అతన్ని. ఆమె చూపులో వేడికోలూ, కళ్ళల్లో ఆశా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి.

    "తప్పకుండా వస్తాను. మీ ఆయన మీద ఒట్టు" చెప్పాడతను లేస్తూ. ట్రైను దిగి కిటికీ దగ్గరికి వచ్చినతను తన చెయ్యి లోపలికి పెట్టి ఆమె చేతిని అందుకున్నాడు.

    "హర్షా" ఆమె అతని చేతిని తన చెంపకి ఆన్చుకుని కళ్ళనీళ్ళు పెట్టుకొంది.

    "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో" అతను కూడా జేబులోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నాడు.

    ట్రైన్ నెమ్మదిగా కదులుతోంది.

    "హర్షా"

    "అమృతా"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS