Previous Page Next Page 
సామ వేద సంహిత పేజి 2

 

 5.    అగ్నిదేవా! నీవు స్తుత్యుడవు. ప్రజాపాలకుడవు. రాక్షస నాశకుడవు. గృహపతివి. యజమాని గృహమును వీడని వాడవు. పరమ పూజ్యుడవు. ద్యులోక రక్షకుడవు. నీవు యజమాని గృహమున నిత్య నివాసము చేయుచున్నావు.
   
6.    అగ్నిదేవా! నీవు అమరుడవు. సర్వజ్ఞుడవు. ఉషాదేవికి చెందిన విశిష్ట ధనమును - హవిస్సులు అర్పించు-యజమానులకు అందించుము. ఉషః కాలమున మేల్కొని ఉన్న దేవతలను ఆహ్వానించుము.
   
7.    అగ్నీ! నీవు వ్యాపకుడవు. దర్శనీయుడవు. రక్షకుడవు. ఈ లోకమున ధనములకు ప్రేరణ కలిగించు వాడవు. ధనములను మా వైపు తరలించుము. వెంటనే మా పుత్రులకు కీర్తి కలిగించుము.
   
8.    అగ్నీ! నీవే రక్షకుడవు. నీవే సత్యము. నీవే జ్ఞానము నీవే మహా మహుడవు. ప్రజ్వలించువాడవు. దీవించువాడవు. విప్రులు నిన్ను స్తుతించుచున్నారు ఉపాసించుచున్నారు.
   
9.    పావక అగ్నీ! నీవు అన్న వర్దకుడవు. స్తుతి యోగ్యుడవు. మాకు ధనము తెచ్చిఇమ్ము. నీతి యుక్తమును, పలువురు ప్రశంసించు నట్టి కీర్తి రూపధనమును మాకు ప్రసాదించుము.
   
10.    దేవతల ఆహ్వాత, ఆనందప్రదాత అగ్ని జనులకు సంపదలు ప్రసాదించును. అట్టి అగ్నికి మాదకసోమ పూర్ణప్రథమ దషకము వంటి స్తోత్రములు చెందును గాక.
   
                                            అయిదవ ఖండము
   
   
ఋషులు :- 1. వామదేవుడు. 2. భర్గుడు. 3, 7. సౌభరి. 4. మనువు. 5. సుదీతి 6. ప్రస్కణ్వుడు.    8. మేధాతిథి. 9. విశ్వామిత్రుడు. 10.  కణ్వుడు.
   
1.    అగ్ని బలపుత్రుడు. మాకు ప్రియుడు. పరిపూర్ణజ్ఞాత. స్వామి. సుయజ్ఞుడు. విశ్వస్యదూత. నిత్యుడు. అట్టి అగ్నిని స్తుతించుచున్నాము. ఆహ్వానించుచున్నాము.
   
2.    అగ్నిదేవా!నీవు అరణ్యములందు, మాతలందు నివసించుచున్నావు. నరులు నిన్ను మధించి సృష్టించుచున్నారు. అట్టి నీవు పూర్ణరూపము దాల్చి శీఘ్రముగ యజమాని హవిస్సులను దేవతలకు అందించుచున్నావు. తదుపరి దేవతలందు శోభిల్లుచున్నావు.
   
3.    ఏ అగ్నిని యజమానులు తమ వ్రతముల కొరకు స్థాపించుచున్నారో, ఎవనికి పరిపూర్ణ మార్గజ్ఞానము కలదో అట్టి అగ్ని దర్శనమిచ్చినాడు. ఎంతో స్పష్టముగా వెలువడినాడు. ఆర్యులను వర్దిల్లచేయు అగ్నిని మాయొక్క స్తుతివాక్కులు చేరును గాత.
   
4.    సోమరసము తీయుటకు శిలలను ఉంచినట్లు, కుశలను ఉంచినట్లు, స్తోతవ్యుడు, అధ్వర్యుడు అగు అగ్నిని ఋత్విజులు యజ్ఞమునకు ముందు, ఉత్తరవేది మీద స్థాపించినారు.
   
    బహ్మణస్పతీ! ఇంద్రాది దేవతలారా! మమ్ము రక్షించుమని స్తుతించి మిమ్ము అర్ధించుచున్నాము.
   
5.    పరివ్యాప్తమగు జ్యోతి రూప అగ్నిని రక్షణార్ధము, ధనార్ధము గాథలతో స్తుతించుచున్నాము. అది విన్న నరులు అగ్నిని తమ కోరికలు తీరుటకు స్తుతించుచున్నారు. అట్టి అగ్ని మాకు నివాసము ప్రసాదించును గాత.
   
6.    అగ్నిదేవా! నీవు వినగలవాడవు. మా మనవి వినుము. మిత్ర, ఆర్యములు ఉదయకాల యజ్ఞములకు యేగువారు. వారితో కూడ నీవు యజనములకు విచ్చేయుము. కుశాసనమున ఆసీనుడవగుము.
   
7.    అగ్ని దీప్తిమంతుడు. ఐశ్వర్యవంతుడు. దేవా భక్తులచే ఆహ్వానించబడువాడు. యజమాని గట్టిగా కేకవేసి అగ్నిని పిలిచి స్వర్గమున తనస్థానము స్థిరపరుచు కొనును. అప్పుడు అగ్ని హవిస్సులు వహించుటకు భూమాత మీదకు దిగును.
   
8.    ఇంద్రదేవా! నీవు పృథ్వినుండి అంతరిక్షము నుండి, బృహత్ నక్షత్ర మండలము నుండి వచ్చి నా తనువును రక్షించుము. మా స్తుతులు గొప్పవి. వానివలన నీవు వర్ధిల్లుము. మా జనులకు కోరిన వరములు ప్రసాదించుము.
   
9.    అగ్నిదేవా! నీకు అరణ్యములు ప్రియములు అట్లయ్యు మాతృరూప జలములందు వసించుచున్నావు. నీవు నాథ దూరమున ఉండుటను మేము సహింప జాలకున్నాము. అందుకే అదృశ్యుడవయ్యును అరణులందు మాకు ప్రత్యక్షమగుచున్నావు.
   
10.    అగ్నిదేవా! నీవు జ్యోతివి నిన్ను మనువు నరుల కొరకు స్థాపించినాడు. యజ్ఞము నిమిత్తము ఆవిర్భవించిన నీవు హవిస్సులచే తృప్తి చెందువాడవు. కణ్వుని వలన దీప్తి వంతుడవైన నీకు నరులు నమస్కరించుచున్నారు.
   
                                             ఆరవ ఖండము
   
ఋషులు :- 2,3,5. కణ్వుడు. 1,7 వసిష్ఠుడు. 4. సౌభరి. 6. ఉత్కీలుడు. 8. విశ్వామిత్రుడు.
   
1.    ధనదాతవగు అగ్నీ! నీకు నలువైపుల నిండిన స్రుక్కులు నిలిచి ఉన్నవి. వానిని వరింపుము. సోమమును సేవింపుము. తరువాతనే ఆహుతులను అందించుము.
   
2.    మాకు బ్రాహ్మణస్పతి లభించును గాత. సత్యప్రియ వాగ్దేవి లభించును గాత. దేవతలు మా శత్రువులను నిశ్సేషముగ నిర్మూలింతురు గాక. నరుల హితము కోరు దేవతలు మమ్ము యజ్ఞాభి ముఖముగ నియమింతురు గాత.
   
3.    అగ్నిదేవా! మమ్ము రక్షించుటకు పైన సూర్యదేవతవై నిలిచినావు. నీవు అన్నదాతవు. మాకు అన్నము ప్రసాదించుమని ప్రార్ధించుచున్నాము.
   
4.    అగ్నిదేవా! నెవెఉ వ్యాపకుడవు. తనకు ధనము లభించవలెనని నిన్ను ప్రసన్నుని చేయుటకు నీకు హవిస్సులు అర్పించు మానవుడు వేలమందిని పోషించగల ధనవంతుడు అగుచున్నాడు. పుత్రవంతుడు అగుచున్నాడు.
   
5.    దేవతల శరణుకోరువారు - సమస్త ప్రజను అనుగ్రహించుమని - అగ్ని దేవుని స్తుతి వచముల ప్రార్దింతురు. అన్యులు సహితము అగ్నిని ప్రదీప్తుని చేయుదురు.
   
6.    ఈ అగ్ని సువీర్యుడు. సర్వ సౌభాగ్యములకు ప్రభువు. అతడు గోవులకు, సంతానమునకు, ధనములకు వాస్తవస్వామి. శత్రువులను హతమార్చు వారల ఈశ్వరుడు.
   
7.    అగ్నిదేవా! నీవే మా యజ్ఞమునకు గృహపతివి. హోతవు. సకల జగములకు ఆరాధనీయుడవగు నీవు 'పోత' యను ఋత్విజుని ఉత్తమ హవిని యజించుము. మాకు ధనము ప్రసాదించుము.
   
8.    అగ్నిదేవా! నీవు నరులకు మిత్రుడవు. జలముల పౌత్రుడవు. మంగల ధనయుక్తుడవు. సత్పురుషులకు సుఖప్రదుడవు. ఉపద్రవ రహితుడవు. మమ్ము రక్షించుమని నిన్ను ప్రార్దించుచున్నాము.
   
                                              ఏడవ ఖండము
   
ఋషులు :- 1 శ్యావాశ్వుడు. 2. వార్షిహవ్యుడు. 3. బృహదుక్దుడు. 4. కుత్సుడు. 5,6. భరద్వాజుడు. 7. వామదేవుడు. 8,10. వసిష్ఠుడు. 9.త్రిశిరుడు.
   
1.    ఋత్విజులరా! అగ్నిదేవుని ఆహ్వానించండి. హవితో సుఖింపచేయండి. అగ్ని దేవతల ఆహ్వాత గృహపతి అతనిని ఉత్తరవేది మీద స్థాపించండి. నమస్కరించండి. యజ్ఞగృహమున యజనీయ అగ్నిని ఆరాధించండి.
   
2.    బాలగ్ని, యువాగ్ని హవి అందించుట చిత్రము! అతడు పుట్టగనే తల్లుల చన్ను కుడవలేదు. పుట్టగనే మహా దూత అయినాడు. హవిస్సులను దేవతలకు అందించుచు సంచరించినాడు.
   
    (ద్యావాపృథ్వులు అగ్నికి తల్లులు.)
   
3.    మృతజీవీ! నీలోని ఒక అంశము అగ్ని. దానిని బాహిరాగ్నిలో లీనము చేయుము. మరొక అంశము వాయువు. దానిని బయటి వాయువులో లీనము చేయుము. మూడవ అంశము ఆదిత్యుడు. దానిని ఆదిత్యునియందు లీనము చేయుము. నీవు మరల తనువును దాల్చుము. కళ్యాణ రూపివగుము. ఉత్పాదక సూర్యుని యందు ప్రవేశించుము.
   
4.    అగ్నిదేవా! నీవు ఆరాధనీయుడవు. సర్వజ్ఞుడవు. నీ కొరకు మేము మంచి మనసుతో స్తుతులు రచించినాము. వానిని - రథమును సంస్కరించిన రీతి - శ్రద్దగా ఆరాధించినాము. నిన్ను సేవించుచున్న మాకు మంచి బుద్దిని చక్కని మనసును కలిగించుము. మాకు మిత్రుడవై సర్వత్ర రక్షింపుము.
   
5.    అగ్ని ద్యులోకమునకు తల. భూమండలమునకు స్వామి. వైశ్వానరుడు. ఋతము. కవి. ప్రకాశకుడు. అతిథివంటి ఆదరణీయుడు. దేవతల నోళ్ళలో ఉన్నవాడు.
   
    అట్టి అగ్నిని మా యజ్ఞమందు ఋత్విజులు ఆవిర్భవింప చేసినారు.
   
6.    అగ్నిదేవా! స్తోతలు నీ సోత్రము లందు తమ మనో రథములను - పర్వతము మీది మేఘము తనయందు వర్షమును వలె - ధరించి ఉన్నారు.
   
    స్తుతులను అనుసరించి సాగు అగ్నీ! అన్నమును అర్ధించు నీ భక్తులు అశ్వము యుద్దమును వశపరచుకొను రీతి స్తుతించి నిన్ను వశపరచు కొనుచున్నారు.
   
7.    అగ్ని యజ్ఞముల అధిపతి. హోత. రుద్రుడు. ద్యావాపృథ్వులకు అన్నప్రదాత. హిరణ్యరూపి. ఋత్విగ్యజమానులారా! అట్టి అగ్నిని మీ రక్షణల కొరకు వజ్రము వంటి మృత్యువాత పడక మున్నే హవిస్సులు అర్పించి ఆరాధించండి.
   
8.    అగ్ని సామ్రాట్టు. ఆర్యుడు. స్తుతుల వలన ప్రదీప్తుడు. అతని రూపము ఘ్రుతాహుతము. నరులు ఎన్నో బాధలకు ఓర్చి హవిస్సులతో అతనిని అర్చింతురు. అట్టి అగ్ని ఉషస్సునకు ముందే సకల దిశల ప్రకాశించును.
   
9.    అగ్ని మహా జ్ఞాన స్వరూపుడు. అతడు రోదసిని చేరి దేవతలను పిలుచుటకు గాను వృషభము వలె నినదించును. అంతరిక్షమున మేఘమధ్యమున వెలుగొందును. వృష్టి రూపమున జలములందు విద్యుద్రూపమున వర్ధిల్లును.
   
10.    అగ్ని ప్రశస్తుడు. దూరదర్శి. గృహపతి. ఆగమ్యుడు. చేతిలో మొలుచువాడు. నరులు అట్టి అగ్నిని అంగుళులతో కల్పించుచున్నారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS