Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 2

    "బన్సీలాల్ కి అయిదువేల బాకీ పడ్డాము. ప్రతి ఏడు పంట రాంగానే సగం డబ్బు కడుతున్నాము. ఎంతసేపూ వడ్డీ ఈ ఏటికి సరిపోయింది అనటం తప్పించి బాకీలో పైసా తీరింది అని చెప్పడు. నా కొడుక్కి ఒళ్ళు మండి గట్టిగా లెక్కలడిగాడు. దాంతో కోపం వచ్చి నా మనుమడిని రాత్రికి రాత్రి ఎత్తుకెళ్ళి దాచేశాడు. మా ఇంటి ముసలిది నా కోడలు నిద్రాహారాలు లేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. నా కొడుకు బన్సీలాల్ ణి నిలదీసి అడిగాడట. "ఏరా వుండాకోర్ వెధవా! నీ కళ్ళకి మేము దొంగమాదచ్చేదులంగా కావస్తున్నామా? బాకీ తీరలేదు కాబట్టి అడిగాము అంతే గాని పిల్లలని ఎత్తుకెళ్ళి దాచే రకాలమనుకుంటున్నావా" అంటూ చావచితక గొట్టాడు. ఇదీ విషయం నాయనా!" ఆనందయ్య కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు.

   
    "బన్సీలాల్ ఇల్లు ఎక్కడ?" రఫూర్ అడిగాడు.
   
    ఆనందయ్య చెప్పాడు.
   
    "నీ మనుమడు ఎన్నేళ్ళవాడు?"
   
    "ఆరేళ్ళు. నాకు ఒక్కడే కొడుకు. వాడికి వాడొక్కడే కొడుకు."
   
    మరికొద్దిసేపు రఫూర్, ఆనందయ్య మాట్లాడుకున్నారు.
   
    "తాతా! నీకు నమ్మకం వుంటే ఇక్కడే వుండి పిలువు.
   
    నాకు నమ్మకము పోయింది. ఓపిక పోయింది...నా గతి ఎలా వుంటే అలా అవుతుంది వెళుతున్నాను" అని చెప్పి రఫూర్ వెళ్ళిపోయాడు.
   
    ఆనందయ్య మరికొద్దిసేపు అక్కడే తచ్చాడి మరోసారి ఎలుగెత్తి అరచి ఎవరూ పలక్కపోవటంతో నిరాశగా తిరుగు ముఖం పట్టాడు.
   
    అప్పుడు సాయంత్రం ఆరు అయ్యింది.
   
                                                                           2
   
    చెన్నాపూర్ __
   
    కాస్త పెద్ద గ్రామమే ఆ చుట్టుపట్ల చిన్న చిన్న గ్రామాలున్నాయి. పేరుకి వేరు వేరు వూళ్ళేగాని వక్తి కొకటి దగ్గరగా ఉన్నాయి.
   
    ఠాకూర్ లు, లాలాలు రెండు రకాల వాళ్ళూ తెగ బలసి వున్నారు. ఎప్పుడో తప్ప వాళ్ళు వకరి మీదికి వకరుకయ్యానికి పోరు. వళ్ళు బలుపులోను, ధనంబలుపులోను ఎవరికెవరు తీసిపోరు. అందుకని వాళ్ళలో వాళ్ళకి ఎంత కక్షలున్నా బయటపడకుండా తప్పుకు తిరిగి వాళ్ళ కసిని బక్కప్రాణాలమీద చూపిస్తుంటారు.
   
    వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు?
   
    దేముడా!
   
    కర్మసిద్దాంతం ప్రకారం ఆయన దిగిరాడు.
   
    మరి పోలీసులా?
   
    వాళ్లున్నది మనుషులని రక్షించటానికి కాదు.
   
    మరి?
   
    దేశం గొడ్డు పోలేదు. దేముడు దిఒగిరాకపోయినా, పోలీసులకి పట్టకపోయినా, తెలుగుదేశానికి తెగులు పట్టిన ఈ రోజుల్లో కుళ్ళిన వ్యవస్థని మార్చటానికి న్యాయాన్ని సొంతంగం చేతులోకి తీసుకున్న ఓ మనిషి పుట్టింది.
   
    ఆ మనిషి స్త్రీ!
   
    ఆమె పేరు ఎవరికీ తెలియదు.
   
    కొందరు శక్తిమాయి అంటారు.
   
    మరికొందరు కాళీమాత అంటారు.
   
    కాళింది తల్లి అన్నవాళ్ళు కూడా వున్నారు.
   
    ఆమె పేరు తెలియదు. ఊరు తెలియదు. అసలు అలాంటి స్త్రీ వుందోలేదో ఇదమిద్దంగా తెలియకపోయినా కళ్ళారా చూడకపోయినా వుందని కొన్ని సంఘటనలవల్ల గాఢంగా నమ్ముతున్నారు ప్రజలు.
   
    సామాన్యులు నమ్ముతున్నారు. వళ్ళు బలుపువాళ్ళు నమ్మటంలేదు. కాదు అలా నమ్మనట్లు నటిస్తున్నారు. వాళ్ళ కింకా పూర్తి అనుభవం కాలేదు. అదీ అసలు విషయం.
   
    చెన్నాపూర్ ఆనుకొని చిట్టడివి వుంది. అడవి అవతల ఎక్కటానికి సాధ్యంకాని కొండలు వున్నాయి. శక్తిమాయి ఆమె తాలూకా మనుషులు ఆ అడవిలో వుంటారని కొండలో దాగున్నారని రకరకాలుగా అనుకుంటుంటారు.
   
    దీనిలోని నిజానిజాలు దైవానికి తెలియాలి.
   
    సామాన్యుడికి తనకష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియక (పెద్దవాళ్ళు వినరు పోలీసులు పట్టించుకోరు) అడవి దగ్గరకొచ్చి పెద్దగా అరిచి గట్టిగా పిలిచి చూస్తారు.
   
    ఆమె పలకదు.
   
    అంతేగాదు. ఎవరూరారు.
   
    అయినా చాలా వింతగా విచిత్రంగా వాళ్ళకొచ్చిన కష్టం ఎలా తీరుతుందో తీరుతుంది. ఈ అద్భుతం మాత్రం ఎవరూ కనిపెట్టలేక పోయారు.
   
    కష్టం తీర్చేశక్తి అడవి తల్లికి వుందా!
   
    ఊహు?
   
    అడవి కదలిరాదు.
   
    ఇది శక్తిమాయి పనే. కాళింది తల్లి చలవే. కాళి అమ్మదయే.
   
    ఆమె అసలు పేరు ఎవరికీ ఎలా తెలియదో ఆమె వయసు రూపురేఖలుకూడా ఎవరికీ తెలియవు. పదహారేళ్ళ బాలిక అని వకరంటే కాదు పండు ముసలమ్మ అంటారు యింకొకరు. ఇరువురు చూసిందంటూ లేదు. ప్రజలు రకరకాలుగా వర్ణించి తృప్తి చెందుతుంటారు.
   
    పోలీసులవల్ల న్యాయం జరగదని ఆనందయ్య అడవికి వచ్చాడు. రఫూర్ మాటలతో నిరాశ చెంది కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS