Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 5


    పరిగెత్తుకొస్తూ చప్పట్ల శబ్దం పెంచి మళ్ళీ పిలిచాడు. కారు రివర్స్ చేస్తున్న శరత్ చంద్రకి కొద్దిగా వినబడింది. బ్రేకుమీద కాలేస్తూ అనుమానంగా పక్కకి చూశాడు.

 

    పరుగులాంటి నడకతో గోపాలం రావడం కనిపించింది! అటే చూస్తూ ఇగ్నీషియన్ కీ వెనక్కి తిప్పాడు. కారు శబ్ధం ఆగిపోయింది.

 

    గోపాల్ చెప్పింది వింటూన్ కారు దిగిపోయాడు శరత్ చంద్ర. కారు లాక్ చేసి పరుగులాంటి నడకతో కారిడార్ లోని మనుషుల్ని తప్పించుకుంటూ కార్డియాలజీ విభాగంవైపు దూసుకుపోయాడు.

 

    అతని వేగాన్ని అందుకోవడం కష్టమైపోయింది గోపాల్ కి.

 

    మృత్యుముఖంలోని రోగిని చూడడంతోనే అతని కళ్ళముందు ఇల్లూ, భార్య... పిల్లలూ... బయటికెళఅళి గడపడం అనే అందమైన దృశ్యం చెదిరిపోయింది.

 

    ఇప్పుడతని సమస్తేంద్రియాలని శక్తిమంతంచేస్తూ కళ్ళముందు కదులుతున్న దృశ్యం....

 

    మృత్యురాక్షసి నోటికి చిక్కి కొనవూపిరితో గిలగిలలాడుతున్న ఈ రోగిని రక్షించుకోవాలన్న సంకల్పమొకటే!

 

    ఈ రోగికి ఎం త్వరగా వీలయితే అంత త్వరగా ఆపరేషన్ జరగాలి. అతను బ్రతకాలంటే ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ జరుగుతుండగా అతను పోయే అవకాశం ఉంది. ఆపరేషన్ చేసేందుకు రోగి తాలూకువాళ్ళ అనుమతి తీసుకున్నాడు.

 

    తన డిపార్ట్ మెంట్ క్ ఫోన్ చేసి థియేటర్ రెడీ చేయమని ఆజ్ఞాపించాడు. తన అసిస్టెంట్స్ డాక్టర్ కిరణ్, రవళిలకి విషయం చెప్పి సిద్ధంగా వుండమన్నాడు.

 

    "సార్ హిజ్ హార్ట్ ఈజ్ స్టాపింగ్" ఫోన్ పెట్టేస్తుండగా గోపాల్ మాట వినిపించింది. ఒక్క అడుగులో రోగిని చేరాడు.

 

    గుండె భాగంలోనే ఛాతి మీద రెండు అరచేతులు వుంచి, బోర్ వెల్ నీళ్ళపంపు కొడుతున్నట్టు ఛాతీని అదుముతూ గుండెకి వత్తిడి కలిగించే మసాజ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ పనిచేస్తూనే అతన్ని స్ట్రెచర్ మీదకి మార్పించాడు.

 

    ఛాతీ భాగానికి చకచకా కరెంట్ వైర్లు కనెక్షన్ అమర్చి గుండెకి కొద్దిపాటి షాక్ ఇవ్వడం మొదలెట్టాడు రఘు.

 

    మృత్యువుతో యుద్ధం తీవ్రమైంది.

 

    క్షణాల్లో స్ట్రెచర్ ఆపరేషన్ థియేటర్ వైపు కదిలింది. శరత్ చంద్ర చేతులు మసాజ్ చేస్తూనే వున్నాయి.

 

    గుండె కొట్టుకోవడం ప్రారంభమై కొద్దికొద్దిగా వేగం అందుకుంటుండగా... స్ట్రెచర్ ఆపరేషన్ థియేటర్ లోకి చొరబడింది!

 

    స్ట్రెచర్ తో పాటు పరుగులాంటి నడకతో లోపలికి చేరిన శరత్ చంద్ర వెనక థియేటర్ తెల్లని తలుపులు... పిల్లల్ని పొట్టలోకి పొదువుకుని రక్షిస్తున్న పావురాయి రెక్కల్లాగా మెత్తగా మూసుకుపోయాయి!

 

    అతనికి బయటి ప్రపంచంతో అయిదు గంటలపాటు సంబంధం తెగిపోయింది!


                                                    *    *    *    *


    అప్పుడే కాలేజీ నుంచి వచ్చి హాల్లో కూర్చుని టీ తాగుతోంది నీలిమ. ఒంటరితనాన్ని తప్పించుకునేందుకు ఈ మధ్యనే పార్ట్ టైమ్ లెక్చరర్ గా ఓ కాలేజీలో చేరింది.

 

    వంటగది వెనక కారిడార్లో పనిమనిషి గిన్నెలు తోముతోంది.

 

    'ఇంకో అరగంటలో పిల్లలు ఇంటికొచ్చేస్తారని' గోడ గడియారము చూస్తూ అనుకుంటుండగా సోఫా పక్కనే ఉన్న ఎక్స్ టెన్షన్ ఫోన్ మోగింది. టీ సిప్ చేస్తూ యధాలాపంగా ఫోనెత్తింది.

 

    విషయం వింటూనే ఆమె మొహం కవళికలు మారిపోయాయి. చేతిలో ఫోన్ వణికింది! మనిషి నిలువెల్లా కంపించిపోయింది! సోఫాని ఒకచేత్తో గట్టిగా పట్టుకుని-

 

    "నేనిప్పుడే బయల్దేరుతున్నాను. బాబు తండ్రి సిద్ధార్ధలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ శరత్ చంద్ర కార్డియో థొరాసిక్ సర్జన్? నాకన్నా మీరు ముందు చేరితే ఆయన్ని పిలిపించండి! థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్" ఫోన్ పెట్టూస్తూనే తాగుతున్న టీకప్పు అక్కడే వదిలేసి బాగ్ తీసుకుని బయటికి పరుగెత్తింది. ఇల్లు తాళంకూడా వేయలేదు.

 

    జీవన్ కి యాక్సిడెంట్ అయిందన్న విషయం ఆమెను తీవ్రంగా కంపింపచేస్తోంది.

 

    ఆటో వేగంగా వెళుతోంది. ఆమె ఆలోచనలు అంతకన్నా వేగంగా పరిపరి విధాల పోతున్నాయి.

 

    "జీవన్ ఎలా ఉన్నాడో...? వాడికెన్ని దెబ్బలు తగిలాయో?

 

    ఫోన్ చేసినవాళ్ళు తనకి నిజమే చెబుతున్నారా?

 

    వాడికింకేంకాలేదు కదా! మువ్వ ఎంత భయపడిపోయిందో?

 

    సమయానికి శరత్ చంద్ర అందుబాటులో ఉంటాడో లేదో....?

 

    వుంటాడు!

 

    ఇంటికి పెందలాడే వస్తానన్నాడు కదా! ఇప్పటికే ఇంటికి బయల్దేరితే? హాస్పిటల్లో తను లేకపోతే జీవన్ కెలా?

 

    తలలో నరాలు చిట్లిపోయేలా ఎడతెగని ఆలోచనలు తొలుస్తుండగానే ఆటో సిద్ధార్ధ సూపర్ స్పెషాలిటీస్ ని సమీపించింది.


                                                     *    *    *    *


    అది ఆపరేషన్ థియేటర్.

 

    యుద్ధ ప్రాతిపదికలా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

 

    పేషెంట్ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు!

 

    ఆగిపోయే లోపలే దాంట్లో మూసుకుపోయిన రక్తనాళాలకి బదులుగా కొత్తవి వేయాల్సి ఉంది. అప్పుడుగానీ ఆగిపోయిన రక్తప్రసరణ మళ్ళీ మొదలై గుండె కోలుకునే అవకాశం లేదు.

 

    రోగి ఆపరేషన్ టేబిల్ మీదకు చేర్చబడ్డాడు.

 

    తలకి ఆకుపచ్చని క్యాప్ లతో, నోటికీ ముక్కుకీ కవర్ చేసే ఫేస్ మాస్కులతో, శరీరాన్నంతా కవర్ చేసే ఆకుపచ్చ యాప్రాన్ లతో అక్కడున్న ప్రతిమనిషీ అలర్టుగా పనిచేసుకుంటున్నారు. ఆ ఎ.సి. రూమ్ వాతావరణమే యుద్ధభూమిలా వుంది. శాంతికాముకుల చేతిలోని తెల్లజెండాల్లా... ట్యూబ్ లైట్లు తమ కాంతిని గదంతా విస్తరిస్తున్నాయి.

 

    చీఫ్ అనస్ఠటిస్ట్ వ్యూహ రచన చేస్తున్న సేనాపతిలా... వేగంగా పనులు చేసుకుంటూనే, సీనియర్స్ కి సూచనలిస్తున్నాడు.

 

    ఫిరంగుల దగ్గర నిలిచిన ప్రత్యేక సైనికుల్లా హార్ట్ లంగ్ మెషీన్ ముందు కూర్చుని సూచనకోసం సిద్ధంగా ఉన్నారు. ఫెర్ ఫ్యూజనిస్టులు.

 

    యూనిఫామ్ లోని సైనికుల్లా ఇతర సిబ్బంది తమతమ స్థానాల్లో పొజిషన్ తీసుకొన్నట్లు నిలబడ్డారు.

 

    రోగి మొహానికీ. ఛాతికీ మధ్య మెడమీద నుండి అడుగు ఎత్తున ఆకుపచ్చ గుడ్డ కర్టెన్ లా అమర్చబడి ఉంది.

 

    ఆపరేషన్ చేయాల్సిన ఛాతీభాగము, ఎడమతొడ కాలిభాగమూ తప్ప అతని శరీరమంతా థియేటర్ గుడ్డలతో కప్పబడి ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS