Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 4

    ఆయన కోపంగా చూశాడు నావైపు.

    "అబ్బే... మావాడు అంటున్నది ఆయన్ను చూసి కాదండీ... మంచి పని వాళ్ళు ఈరోజుల్లో దొరకడం కష్టం కదా! అందుకనే మీ పని మీరే చేసుకుంటున్నారని వాడి ఉద్దేశ్యం" అంటూ చంచల్రావు సర్ది చెప్పాడు.

    అతడు శాంతించాడు.

    "మీరు కూర్చోండి"

    పెళ్ళాం చెప్తే తప్ప కూర్చునేలా లేడు మహానుభావుడు.

    అతను కూర్చున్నాడు.

    "చూడబ్బాయ్...ఇంతకీ గదిలో అద్దెకు ఉండేదెవరూ?" అందావిడ ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ.

    "నేనేనండి" అన్నాను ముందుకు గబుక్కున వంగుతూ. అలా స్పీడుగా వంగడం వలన బ్యాలెన్సు తప్పి ముందుకు తూలిపడ్డాను.

    "అబ్బే... ఈ మాత్రం దానికి కాళ్ళమీద పడడం ఎందుకు నాయనా"

    ఆవిడ పాదాలు వెనక్కు లాక్కుంది.

    "మావాడికి పెద్దలంటే మహాగౌరవం లెండి" హుషారుగా ముందుకి వంగి ఆవిడతో చెప్పాడు చంచల్రావు.

    చంచల్రావుకూడా బ్యాలెన్సు తప్పాడు.

    ఆవిడ మళ్ళీకాళ్ళు వెనక్కులాక్కుంది.

    "మావాడికి కూడా పెద్దలంటే మహా భక్తిలెండి" అన్నాను కసిగా.
    చంచల్రావు లేచి కూర్చున్నాడు.

    "మీరిద్దరూ మరీ సోఫా అంచుమీద కూర్చోకుండా కాస్త వెనక్కు జరిగి కూర్చోండి"అన్నాడు ఇంటాయన మా ఇద్దర్నీ అదో మాదిరిగా చూస్తూ.

    "మీ యిద్దర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏం వినయం?... ఏం వినయం? గాడి మీకే ఇవ్వాలని నాకు ఉందిగానీ మా రాణీక్కూడా మీరు నచ్చాలి. దానికి నచ్చిన వాళ్ళకే మేము గాడి అద్దెకిస్తాం" ఆవిడ అంది.

    "రాణీ ఎవరండి?" చంచల్రావు అడిగాడు.

                            

       "మా అమ్మాయి".

       నా మెదడు చురుకుగా పనిచేసింది. వీళ్ళ వయసుబట్టి చూస్తే బహుశా రాణికి ఏ పద్దెనిమిదో ఇరవై ఏళ్ళో ఉంటాయి.
                            

  నాలో సంతోషం ఉరకలు వేసింది. ఇంటాళ్ళకి వయసులో ఉన్న అమ్మాయి ఉంటే బ్రహ్మచారి ముండావాళ్ళకి మంచి కాలక్షేపం.                             

  
    చంచల్రావు నా తొడ గిల్లాడు.

    "లక్కీ ఫెలో"

    "మరి మీ కండిషనేమిటో చెప్తే నేను యిమ్మీడియట్ గా ఒప్పేసుకుంటాను" అన్నాను ఆవిడతో.

    "అబ్బే... కండిషను పెద్దదేం కాదు.... మా రాణిని ప్రేమగా చూడాలి... రాణీ ఎంత అందంగా ఉంటుందనుకున్నావ్?"

    నా సంతోషాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను.

    "యాహూ..." నాకంత పెద్దగొంతు ఉందని నాకే తెలీదు.

   సంతోషం నుండి తేరుకుని చూద్దును కదా ఆవిడా ఆయనా ఇద్దరూ సోఫాలోంచి క్రిందపడిపోయి ఉన్నారు.

    చంచల్రావు మూర్చ స్థితిలో ఉన్నాడు!

    కొన్ని క్షణాల తరువాత ఆవిడలేచి సోఫాలో కూర్చుంది. ఆయనకూడా లేచి సోఫాలో కూర్చుని బనీసు ముందుకు లాగి గుండెలమీద "థూ...ధూ..." అని ఊదాడు.

    నేను చంచల్రావు భుజాలుపట్టి కుదిపాను. వాడి కనుగుడ్లు నెమ్మదిగా కదిలి నా వైపు చూశాయి.

    "ఒరేయ్... మనం ఇలా చెవులమీద పడేలా కాకుండా క్రాపు కాస్త దగ్గరికి చేయించు కోవడం మంచిది. చెవులు సరిగ్గా వినబడ్డంలేదు. ఒకదానికి ఒకటి వినిపిస్తుందేమోనని అనుమానంగా ఉంది" అన్నాడు మెల్లిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS