Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 4


    దానికితోడు తల్లీ, తండ్రీ తప్పా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అతన్ని వెటకారం చేస్తున్నట్లూ, ఏడిపిస్తున్నట్లూ కనపడేవాళ్ళు. ముఖ్యంగా తోటిపిల్లలు, బడిపిల్లలు మామూలుగా ఒకరిపట్ల ఒకరు ఎంత స్నేహానురాగాలతో వుంటారో, ఏమాత్రం చిలిపి తగాదా వచ్చినా ఒకరినొకరు అంత ద్వేషించుకుంటారు. అంత హింసించుకుంటారు. బయటివాళ్ళ లోపాలను వెలికితీసి కసితీరా మొహంమీద బాణాలు వొదిలినట్లు వొదులుతారు. అసలు మృత్యుంజయరావుతో స్నేహం చేసినవాళ్ళే అంతంతమాత్రం. కారణం వున్నా లేకపోయినా కల్పించుకుని అతనిమీద హింసాకాండ జరుపుతూ వుండేవాళ్ళు. అతను సాధారణంగా అణుచుకోలేక ప్రయత్నిస్తే "పోరా. ముక్కువంకరవాడా! బక్కవెధవా! తొస్సినోరు సన్యాసీ! నల్లకోతీ!" యిట్లా రకరకాల పేర్లుపెట్టి యేడిపించేవాళ్ళు. తనలోని లోపాలని అలా బహిరంగపరచి ఎత్తిపొడుస్తూ వుంటే అతను ఉడుకెత్తిపోయేవాడు. ఏమీ చేయలేక కృంగిపోయేవాడు. అతను కష్టపడి ఒకరిద్దరు ఆప్తమిత్రుల్ని సంపాదించుకుని, వాళ్ళ స్నేహం యెక్కడ చెడుతుందోనన్న భయంతో వాళ్ళని అందలమెక్కిస్తూ, బాగా మేపుతూ, జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాడు. అలాంటివాళ్ళుకూడా ఏదో అల్పవిషయాన్ని పురస్కరించుకుని అతనిని బిరుదులతో తిట్టటం మొదలుపెట్టే వాళ్ళు. అతనికి మతిపోయేది. ఈ ప్రపంచంలో బ్రతకటానికి తనకు అర్హత లేదనుకునేవాడు. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేవి. ఎప్పుడైనా అతను కోపం ఆపుకోలేక తనూ నాలుగుతిట్లు లంకించుకునేసరికి వాళ్ళంతా కలిసి ఒకటై, అతన్ని ముట్టడించేవాళ్ళు. ఒకడు వెనకనుంచి వచ్చి కళ్ళుమూస్తే, మిగతా వాళ్ళంతా ఒక్కుమ్మడిగా దండయాత్రచేసి చితకబొడిచిపోయేవాళ్ళు. ఒక్కోసారి దెబ్బలు బాగా తగిలి నోట్లోంచి నెత్తురుకూడా కారుతూవుండేది. అతనెవరితోనైనా విరోధం పెట్టుకుంటే, అవతలివాడు యితన్ని కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ వుండేవాడు. రోజుకు ముప్పయిసార్లు కనిపిస్తే ముప్పయిసార్లు ఏడిపించేవాడు. వీలున్నప్పుడల్లా జల్లకొట్టి పోతూండేవాడు. ఆ చెర అనుభవించలేక అతను దారిమార్చి సందులూ గొందుల్లోంచి దూరిపోతూండేవాడు. అయితే అతన్ని పీడించి కాల్చుకుతినేవారు. ప్రతి సందుకీ, గొందికీ ఒకడు చొప్పున తయారయితే అతను ఎంతకని తప్పించు కుంటాడు? ఇహ అన్నీ వింటూన్నా తనకేమీ వినబడనట్లు తలవంచుకుని పోయేవాడు. ఆ మాటల్ని విని తను బాధ పడకూడదనుకునేవాడు. వాటికి అలవాటు పడిపోవాలనుకునేవాడు. అయినా ఏరోజుకారోజు నూతనంగా బాధపడేవాడు. ఒక్కోసారి బాధపడటానికి అభిమానం అడ్డువచ్చేది. అయితే అది క్షణికమే. ఆ క్షణం గడిచాక అభిమానాన్ని విస్మరించి మళ్ళీ బాధ పడుతూండేవాడు. బడిలో మేస్టర్లుకూడా సమయం చూసుకుని, లేకపోతే ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని అతన్ని వికృతంగా చూస్తూ, తమ పరిభాషలో తూలనాడే వాళ్ళు. అంత చిన్నవయసులోనే అతనికి ప్రపంచమంటే ఉక్రోషంగా, కసిగా వుండేది. భూమ్మీది ప్రతిమనిషి ఓ దుర్మార్గుడిలా కనిపించేవాడు. ఎవరికీ హృదయం, మార్దవం వున్నట్లు తలపించేదికాదు. కాని కొన్ని దివ్యక్షణాలుండేవి. ఆ దివ్యక్షణాల్లో తను అందరిలాంటి మానవుడ్నే అని స్ఫురిస్తూ వుండేది. తనలో చెప్పుకోదగ్గ లోపం కనబడేదికాదు. తనకంటే అనాకారి వాళ్ళను అతనెందర్నో చూశాడు. ఆ మాటకొస్తే తను కురూపికాదు. తనచుట్టూ వున్నవాళ్ళలోనే అక్కడక్కడా కురూపులున్నారు. వాళ్ళందరూ తనకంటే ఎన్నో రెట్లు సంతోషంగా తిని తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఒకడికి స్ఫోటకం మచ్చలు, యింకొకడికి యింతింతలావు నాసికారంధ్రాలు, యింకొకడికి అన్నీ దేనికిది విడివిడిగా సరిగ్గానే వున్నా, కలిపిచూసేసరికి భరించలేని అనాకారి తనం...! వాళ్ళు దాన్నిగురించి ఆలోచిస్తున్నట్లే పొడిగట్టేది కాదు. వాళ్ళని ఎవరూ ఏడిపించేవాళ్ళుకాదు. మరి తనమీదే ఎందుకు పగబట్టారు? వారిలో ఆ అవలక్షణాలన్నిటినీ మరుగుపరిచే పుష్టికరమైన మరో విశేషమేదో వుండి వుంటుంది. అదేమిటో ఎంత ఆలోచించినా తట్టేదికాదు. బహుశా తనలో కొరతే వుండి వుంటుంది.
    అతనికి యింకో సత్యంకూడా తడుతూ వుండేది! కురూపులూ, అంగవైకల్యం కలవాళ్ళూ ఏ బిచ్చగాళ్ళలోనో, లేకపోతే పుస్తకాల్లోని పాత్రలలోనో వుంటే ప్రజలు సానుభూతి కురిపిస్తారుగానీ, తమ మధ్యే వుంటే హర్షించరనే విషయం.
    దేముడ్ని తిట్టుకునేవాడు. దేముడ్ని విరోధి క్రింద పరిగణించాడు. మళ్ళీ దేముడంటే భయపడుతుండేవాడు.
    జగతి చిన్నప్పట్నుంచీ విచిత్రంగా, పెళుసుగా వుండేది. ఒక్కోసమయంలో యీ అమ్మాయి పిచ్చిపిల్లేమో అని యితరులకు అనిపించేటట్లు ప్రవర్తించటం కూడా కద్దు. ఎవర్నీ, తల్లిదండ్రుల్ని సైతం లెక్కచేసేది కాదు. ఎప్పుడూ వెకిలిగా నవ్వుతూ వుండేది. ఆమె ప్రతిచేష్టలోనూ అన్వేషణ లేదా తీరని తమకం దృగ్గోచరిస్తూ వుండేది.
    తమ్ముడ్ని ఆమె ఎప్పుడూ దయగా, అభిమానంగా చూడలేదు. అతని రూపాన్ని అతని ముఖం ఎదుటే చీదరించుకుంటూ వుండేది. అతని ప్రతిమాటా అస్తవ్యస్తంగా, అపసవ్యంగా వినిపించేవి. అతని ప్రతి చేష్టా వికృతంగా, విపరీతంగా గోచరించేదామెకు.
    అతనేదయినా చెబుదామని ఎంతో ఆతృతగా వస్తే "నీ మొహం! ఊరుకో. నీకు మాట్లాడటం తెలీదు" అనేది.
    "వినలేక చస్తున్నాం, ఆపరా బాబూ" అనేది.
    "వినలేక చస్తున్నాం, ఆపరా బాబూ" అనేది.
    ఎప్పుడూ అతన్ని అట్లాంటి పక్షి, యిట్లాంటి పక్షి అన్న బిరుదులతో సత్కరిస్తూ వుండేది. అతనెప్పుడో పొరపాటున "పోవే పక్షి" అని నోరు జారేసరికి రాక్షసిలా విరుచుకుపడి "ఎంతమాట పడితే అంతమాట అంటావా? అప్రాచ్యపు వెధవా" అని తిట్టిపోసింది.
    "ఎలా మాట్లాడాలో తెలీదు బామ్మా. వాడనే దానికి అర్ధమేమిటో వాడికి తెలీదు" అంది ప్రక్కనున్న ప్రక్కింటి ముసలమ్మతో ఫిర్యాదుగా.
    "పక్షి" అంటే నిగూఢమైన తప్పేమిటో మృత్యుంజయరావుకు అప్పటికీ యిప్పటికీ తెలియదు.
    అతనెప్పుడైనా ఆప్యాయంగా దగ్గరకు వచ్చి నిలబడితే "అలా మీదమీదకి వచ్చి మొహంలో మొహం పెడతావేం? పాచివాసనా నువ్వూను" అని దులిపేసి, తనకేదో అంటినట్లు దులుపుకునేది.
    తనతో తమ్ముడ్ని ఎక్కడికైనా తీసుకుపోవటం ఆమెకిష్టం వుండేదికాదు. నామోషి, నామర్దా. నలుగురూ నవ్వరూ!
    అయినా అదేం చిత్రమో, అతను అక్కగారంటే పడిచచ్చేవాడు. రాత్రుళ్ళు మెల్లిగా ఆమెపక్కలోకి దొర్లి, ఆమెకు తెలీకుండా ఆమెప్రక్కన పడుకునేవాడు. ఎంత విసుక్కుంటున్నా, ఎంత చీదరించుకుంటున్నా ముఖంలో ముఖం పెట్టటానికి ప్రయత్నించేవాడు. ఆమెనీడలో తల దాచుకుందామని తాపత్రయ పడేవాడు.
    ఈలోపుగా యింట్లోని అన్నదమ్ములూ, ప్రపంచం భానుమూర్తిని నానా హింసలూ పెడుతూనే వున్నారు. ఈ హింసాకాండ భరించలేక కాదుగాని, కలరా తగిలి అతను అకస్మాత్తుగా యీ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు.
    శ్రీదేవి అనాధ అయింది. ఆమెచుట్టూ దట్టమైన చీకటి వ్యాపించింది. ఇద్దరు పిల్లలూ, తనూ ఎక్కడకు పోతుంది? తండ్రి ఏనాడో దివంగతుడయ్యాడు. చెల్లెలు భానుమతి తండ్రి చూసిన సంబంధం చేసుకుని గుట్టుగా ఎక్కడో కాపరం చేసుకుంటోంది. ఆమె పంచనచేరి వాళ్ళ జీవితాల్లో చికాకు ఏర్పరచటం ఆమె అభిమతంకాదు. ఆలోచించి ఆలోచించి యిహ ఏ గత్యంతరమూ లేక అత్తింటిని చేరి ఆశ్రయంకోరింది. అంతగా నిరాకరిస్తే వాటాకోసం కోర్టుకెక్కుతుందని భయపడ్డారో ఏమో... తను పెరట్లో శిధిల గృహంలా వున్న అవుటుహౌసునిచ్చి, వేళకింత పడేస్తూ వుండేవారు.
    అది పదిమందిగల కుటుంబం. వయసులోవున్న పురుషులు ఆ యింట చాలామంది ముసుల్తున్నారు. శ్రీదేవివంటి రూపవతిమీద వాళ్లకున్ను పడిందంటే ఆశ్చర్యంలేదు. ఆమెను లోబర్చుకుందామనీ, సాధించుదామనీ ఒకరికి తెలీకుండా ఒకరు ప్రయత్నించారు. ఉమ్మడిగా ప్రయత్నించారు. జట్లు జట్లుగా ప్రయత్నించారు. వాళ్ళ ఉపాయాలన్నీ పారకపోయేసరికి అందరూ ఏకమై ఆమెమీద కత్తిగట్టి కక్ష సాధించనారంభించారు. ఆమీదట ఆమె పడే కష్టాలకు అంతులేకుండా పోయింది.
    అయినా వీటన్నిటినీ ఓర్చుకుని తన యిద్దరి పిల్లలమీది మమకారంతో, వాళ్ళ భవిష్యత్తుమీది ఆశలతో ఆమె ఎలాగో జీవనయాత్ర సాగిస్తోంది.వాళ్ళని కష్టపడి బడికి పంపిస్తోంది. చదువు చెప్పించటానికి శ్రమపడుతోంది.
    జగతి యుక్తవయస్కురాలయి కూర్చుంది.
    తల్లినుంచి పుణికిపుచ్చుకున్న ఆమె సౌందర్యం రెక్కలు విచ్చుకుని వికసించసాగింది. సౌందర్యాలలో అనేకరకాలుంటాయి. ఒకరకం సౌందర్యాన్ని సొంతచేతులతోగానీ, యితరులచేతగానీ చెక్కు చెదరనివ్వకూడదనిపిస్తుంది. ఒకరకం సౌందర్యాన్ని కాల్చుకు తినాలనిపిస్తుంది.
    అలాంటి రెండో రకానికి చెందినది జగతి సౌందర్యం.
    తన గతచరిత్రా, ఆ చరిత్రతాలూకు చివరిపుట ఐన కూతురి మోహమాధురి శ్రీదేవిని వేయిపడగల నాగులా, దానితాలూకు వేయి నాగదంష్ట్రలుగా, వేయి నాలుకలుగా, వేయి బుసలుగా ఆమెను భయపెట్టసాగింది.
    అందులోనూ ఉల్కలాంటి జగతి ప్రవర్తనా, ఆమె యితరులకు యిచ్చే చనువూ, సృష్టించే వాతావరణం, ఆమె చిరునవ్వూ, తాను చల్లగా వుంటూ యితరుల్లో ఎగజిమ్మించే మంటలూ, తాను మండుతూ యితరుల్లో వెదజల్లించే చల్లదనం శ్రీదేవిని భయభ్రాంతురాల్ని చేశాయి.
    తన హితబోధలతో, బుజ్జగింపులతో, శాసనాలతో కూతుర్ని ప్రపంచానికి దూరంగా కట్టివేసేయాలని ప్రయత్నించింది. సాధించలేకపోయింది. చిన్నప్పుడు జగతి లేడిపిల్లలా ఛంగున గంతులువేస్తూ పరుగెడుతూంటే, పొరుగింటి ఓ వృద్ధుడు ఆ పిల్లకి "దొరకదు" అని పేరు పెట్టాడు. 'వొసేయ్ దొరకదూ!" అని పిలిచేవాడు. ఆమె ఆ పేరుని ఒకరకంగా సార్థకం చేసుకుంది. ఆమెతల్లికి దొరకలేదు. ఏ కొక్కిరాయికో దొరికింది. ఆ కొక్కిరాయితో అంతర్థానమైంది.
    దాంతో శ్రీదేవి బ్రతుకు మరింత హీనమైంది. ఆమె నివసించే శిథిలగృహం మరింత శిథిలమైనట్లు గోచరించింది. తమ తప్పులు ఎదుటివారిలో చూడటం కన్నా భయంకరమైన శిక్ష లేదు భూమ్మీద. ఆమె చచ్చిపోవటానికి అభ్యంతరం లేదుగానీ, బ్రతుకులాగే చావులోనూ రుచి కనబడక, బ్రతకసాగింది.
    ఈలోపున తనదారిన తను- తన బలహీనతలతో, అసహ్యాలతో పెరుగుతున్న మృత్యుంజయరావు అక్కగారి యీ దృష్టాంతంతో లోకం దృష్టిలో అవహేళనకి గురి అయ్యాడు. అతనప్పటికి కాలేజికి పోయి చదువుకుంటున్నాడు. ప్రతివాళ్ళూ కాలేజికి చాలా తేలిగ్గా, సునాయాసంగా పోతూ కాలం గడిపేస్తారు. తను వేసే ప్రతి అడుగునూ తను గుర్తిస్తూ, మీదపడే వికృత చూపుల్ని ప్రతినిముషమూ ఓర్చుకుంటూ జీవించటం ఎంత దారుణం! ఇవన్నీ లెక్కచేయనట్లు కనబడాలని అతనికి తీవ్రమైన కాంక్ష. తనముఖంమీద నిరంతరం చిరునవ్వు వెలుగుతూవున్నట్లు గోచరించటానికి ప్రయత్నించేవాడు. ఆ నవ్వుకోసం అద్దంముందు గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. అ నవ్వుకోసం అద్దంముందు గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. కాని విశేషమేమంటే అతని ముఖం మందస్మితం అని ఎవరూ అనుకున్న పాపాన పోలేదు.
    మృత్యుంజయరావు చదువుకూడా గ్రుడ్డిగానే సాగింది. అతను ఏనాడూ తీరిగ్గా కూర్చుని తన భవిష్యత్తుని గురించి పునాదులు నిర్మించుకోలేదు. ముందు ముందు తాను ఏమిగా రూపొందాలి? డాక్టరా? ప్లీడరా? ఇంజనీరా? కలెక్టరా? పోనీ గుమాస్తానా? ఏమైనా వ్యాపారస్థునిగానా? ఏమిటి తన జీవిత పథకం? అతనెప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించటం చేతకాలేదు.
    బి.ఏ. పాసైనరోజున తల్లిదగ్గరకు వచ్చి నెమ్మదిగా ఆ విషయం వివరించాడు.
    ఆమె మంచంమీద ముసుగు కప్పుకుని వుంది. "అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?" అని ప్రశ్నించింది ఒక క్షణమాగి.
    "అవును. ఏమి చెయ్యాలి?" అని విస్మితంగా ప్రశ్నించుకున్నాడు మృత్యుంజయరావు.
    "నువ్వు డాక్టరువవుతే బాగుంటుందని నా ఉద్దేశం" అంది తల్లి కాస్త ఆలోచించి. తల్లికి చదువుల వివరాలగురించి ఏమీ తెలియనందుకు అతను బాధపడి, "ఇదివరలో నేను తీసుకున్న గ్రూప్ కి ఆ చదువు చదవటానికి వీలులేదమ్మా!" అన్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS